Venkateswarlu
Venkateswarlu
అతడో బాధ్యత కలిగిన పోలీస్ కానిస్టేబుల్. తప్పు చేస్తే లాఠీ పట్టుకుని దండించే అధికారం ఉన్న అతడే.. తప్పు దోవ పట్టాడు. దొంగలతో చేతులు కలిపి.. దొంగల్లో దొంగల్లా కలిసిపోయాడు. దొంగలతో కలిసి ఇళ్లు దోచుకోవటం మొదలుపెట్టాడు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన యల్లప్ప అనే వ్యక్తి బనశంకరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
ఇతడు తన ప్రియురాలితో జల్సాలు చేయటానికి దొంగ తనాలు చేయటం మొదలుపెట్టాడు. కొందరు దొంగలతో కలిసి బనశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని పోలీసులు ఎంక్వైరీ చేశారు. అతడు ఓ మూడు,నాలుగు దొంగతనాలు చేసినట్లు తెలిపాడు. తాను పని చేస్తున్న స్టేషన్‌లో కూడా దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించాడు. పోలీసు అతడిపై కేసు నమోదు చేశారు.
ఉన్నతాధికారులు అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. అతడు దొంగిలించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకోవటానికి అతడ్ని ఊరికి తీసుకెళ్లాని భావించారు. ఈ నేపథ్యంలో అతడు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. తనను ఎట్టి పరిస్థితుల్లో ఊరికి తీసుకెళ్లవద్దని, తన పరువు పోతుందని ప్రాథేయపడ్డాడు. ప్రస్తుతం కానిస్టేబుల్ దొంగ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి, ప్రియురాలితో కలిసి జల్సాలు చేయడానికి పోలీస్ కానిస్టేబుల్ దొంగతనాలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.