రాజుకున్న ఉప ఎన్నికల వేడి, హుజూరా బాద్, బద్వేల్ ఎన్నికల తేదీ ఖరారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగాల్సిన రెండు స్థానాలకు షెడ్యూల్ విడుదలయ్యింది. వచ్చే నెల ఆఖరిలో పోలింగ్ జరగబోతోంది. అక్టోబర్ 30న దానికి ముహూర్తం పెట్టినట్టు ఈసీ ప్రకటించింది. దాంతో తెలంగాణాలో హుజూరా బాద్, ఏపీలో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల వేడి మరింత రాజుకునే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణాలో కేసీఆర్ వెంట సుదీర్ఘకాలం పాటు సాగిన ఈటెల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి టీఆర్ఎస్ ని వీడి బీజేపీ అభ్యర్థిగా రాజేందర్ రంగంలో ఉన్నారు. ఇప్పటికే ఆయన మూడు నెలలుగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపించి, కేసీఆర్ కి బుద్ధి చెప్పాలని ఆయన కోరుతున్నారు. తెలంగాణా రాజకీయాల్లో హుజూరా బాద్ తీర్పు కీలక మార్పులకు దోహదం చేస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడించిన బీజేపీకి ఇప్పుడు ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి. దుబ్బాక తర్వాత జీహెచ్ఎంసీలో కూడా ఆపార్టీ ప్రభావం కనిపించింది. కానీ నాగార్జున సాగర్ లో వెనుకబడింది. అయినప్పటికీ హుజూరా బాద్ తమదేననే ధీమా బీజేపీ నేతల్లో ఉంది.

టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసీఆర్ స్వయంగా పావులు కదుపుతున్నారు. ఈటెలను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టడి చేయాలనే సంకల్పంతో ఆయన కనిపిస్తున్నారు. తెలంగాణా గడ్డ మీద వివిధ కొత్త పథకాలతో ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. దళితబంధు వంటివి ప్రవేశ పెట్టి గట్టి ఆశలతో సాగుతున్నారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ పెద్దలతోనూ సఖ్యంగా మెలుగుతూ రాష్ట్ర బీజేపీ నేతలను కట్టడి చేసే ప్రయత్నం మొదలెట్టేశారు. అదే సమయంలో హరీష్‌ రావు ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. దాంతో ఈటెల్ వర్సెస్ హరీష్ రావు అన్నట్టుగానే ఎన్నికల వాగ్వాదం సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించినా నేరుగా కేసీఆర్ నే తాను ఢీకొడుతున్నానే అభిప్రాయం ఈటెల లో కనిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది తెలంగాణా రాజకీయాల్లో కీలకం అవుతుంది. బీజేపీ విజయం సాధిస్తే ఆపార్టీకి మరింత జోష్ వస్తుంది. రాబోయే ఎన్నికల్లో పట్టుదల ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. అదే సమయంలో టీఆర్ఎస్ కి ఇది పెను సవాల్ గా మారింది. ఈటెల మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడితే అది కేసీఆర్ కి కొత్త సమస్యలు తెస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణా ఉప ఎన్నికల వేడి కీలకంగా మారే అవకాశం ఉంది.

బద్వేల్ లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. కానీ ఆపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ దాదాపుగా వెంకట సుబ్బయ్య కుటుంబీకులను రంగంలో దింపడం ఖాయంగా ఉంది. ఆయన భార్య పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దాంతో వైఎస్సార్సీపీకి ఇక్కడ విజయం నల్లేరు మీద నడకలానే కనిపిస్తోంది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ఎంత ప్రయాసపడినా డిపాజిట్ తెచ్చుకోవడమే గగనమన్నట్టుగా మారింది. ఈ నేపథ్యంలో బద్వేల్ బరిలో టీడీపీ ఏమేరకు ప్రభావం చూపగలదన్నది సందేహంగానే ఉంది. దాంతో ఏపీలో అధికార పార్టీ ధీమా గా ఉండగా, తెలంగాణాలో పాలకపక్షానికి ఈ ఉప ఎన్నికలు పెను సవాల్ కాబోతున్నట్టు చెప్పవచ్చు.

ఉప ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడుతుంది. 8వ తేదీన నామినేషన్ల స్వీకరణకు తుది గడువుగా నిర్ణయించారు. 11వ తేదీన స్క్రూట్నీ, 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ప్రకటించారు. అక్టోబర్ 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు ఒకేసారి జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడి, అక్టోబర్ నెలాఖరులోగా ముగించబోతున్నారు.

Show comments