వాతావరణ శాఖ కీలక అప్‌డేట్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఇకపై వానలే వానలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా.. అదికూడా రెండు, మూడు రోజులకొకసారి వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మాత్రం ఎండాకాలం లాగా మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయట తిరగటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాల కారణంగా జూన్‌, జులై నెలల్లో బాగానే వర్షాలు కురిశాయి. ఆగస్టుకు వచ్చే సరికి ఆ పరిస్థితి మారిపోయింది. వర్షాలకు బదులు ఎండలు దంచికొడుతున్నాయి. అయితే, వచ్చే సెప్టెంబర్‌ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా వేసింది. వచ్చే నెల మొదటి వారం నుంచి వర్షాలు పడతాయని తెలిపింది.

వచ్చే నెల నుంచి రుతపవన ద్రోణి ప్రభావం ఏపీపై పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి వచ్చే నాలుగైదు రోజులనుంచి మళ్లీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, తెలంగాణలో కూడా మళ్లీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో సెప్టెంబర్‌ 2 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

వచ్చే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం లేదని తెలిపింది. ఆ తర్వాతినుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, తెలంగాణలో గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ ఆగస్టు నెలలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. 1972లో 83.2 మిల్లీమీటర్ల శాతం వర్షపాతం నమోదు కాగా.. ఆ రికార్డును బ్రేక్‌ చేస్తూ ఈ సంవత్సరం 74.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరి, త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ మొదలవుతాయన్న వాతావరణ శాఖ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments