కాదేదీ ఆంధ్రజ్యోతి దుష్ప్రచారానికి అనర్హం

కాదేదీ కవితకు అనర్హం అన్నారో మహా కవి. వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై దుష్ప్రచారం చేసేందుకు కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది ఆంధ్రజ్యోతి తీరు. తాజాగా పింఛన్ల పంపిణీపై ఆంధ్రజ్యోతి రాసిన వార్త.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పట్ల సదరు పత్రిక యాజమాన్యం వైఖరిని తేటతెల్లం చేస్తోంది.

గత ప్రభుత్వం నిర్వాకాలను పక్కనబెట్టి.. జగన్‌సర్కార్‌ అప్పులు చేస్తోంది,. రాష్ట్రం దివాళా తీస్తోంది.. జీతాలు ఇవ్వలేకపోతోంది.. అధిక వడ్డీలకు అప్పులు చేస్తోంది.. అంటూ ఇటీవల కొన్ని రోజులుగా చిలువలుపలువలుగా చేసి ఆంధ్రజ్యోతి రాతలు రాస్తోంది. తద్వారా జగన్‌ సర్కార్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తోంది. విభజన సమయంలో ఏపీకి వచ్చిన అప్పులు 97 వేల కోట్ల రూపాయలు కాగా.. ఐదేళ్ల చంద్రబాబు పాలన తర్వాత ఆ మొత్తం 2.65 లక్షల కోట్ల రూపాయలకు చేరగా.. చంద్రబాబును సంపద సృష్టికర్తగా, వైఎస్‌ జగన్‌ను పరిపాలన తెలియని నేతగా చిత్రీకరించేందుకు శతవిధాలుగా ఆంధ్రజ్యోతి యత్నిస్తోంది.

జగన్‌ సర్కార్‌పై దుష్ప్రచారం చేసేందుకు పింఛన్ల పంపిణీని కూడా ఆంధ్రజ్యోతి ఉపయోగించుకుంటోంది. పింఛన్‌ పంపిణీ తొలి రోజు 13 లక్షల (22 శాతం) మందికి ఇవ్వలేకపోయారంటూ, దానికి కారణం నగదు కొరతేననేలా రాసుకొచ్చింది. డబ్బులు రాలేదని వాలంటీర్లు తమ పరిధిలోని వృద్ధులకు కూడా చెప్పారంటూ అసత్య సమాచారాన్ని సదరు వార్తలో వండివార్చింది. బ్యాంకుల్లో నిధులు లేక ఇవ్వలేకపోయామంటూ సిబ్బంది చెప్పారని కూడా ఆకాశరామన్న చెప్పినట్లుగా రాసుకొచ్చింది.

పింఛన్‌ డోర్‌ డెలివరీ ప్రారంభమైన సమయంలో.. ఒకే రోజులో మొత్తం పింఛన్లు పంపిణీ చేయాలని జగన్‌సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వాలంటీర్లకు 1వ తేదీ ముందు రోజే నగదు అందిస్తోంది. అయితే పింఛన్‌ పంపిణీ రోజున లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడం, సర్వర్‌ సమస్యలు, వాలంటీర్లు విధులకు గౌర్హాజరవ్వడం వంటి కారణాలతో తొలి రోజు వంద శాతం పింఛన్ల పంపిణీ సాధ్యం కావడం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత.. ఒక్క రోజు నిబంధనను సడలించింది. ఒకటి, రెండు, మూడు తేదీలలో పింఛన్ల పంపిణీ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో వాలంటీర్లు వంద శాతం మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తొలి రోజే 80–90 శాతం పంపిణీ జరుగుతుండగా.. మిగిలిన 10–20 శాతం మందికి మరుసటి రెండు రోజుల్లో ఇస్తున్నారు.

జూన్‌ నెలలో ఏపీలో 54.96 లక్షల మందికి మొదటి తేదీనే పింఛన్‌ నగదును అందించారు. మొత్తం పింఛన్లలో వీరు దాదాపు 90 శాతం. జూలైలో మొదటి రోజున 56.12 లక్షల (దాదాపు 91 శాతం) మందికి పింఛన్‌ సొమ్ము పంపిణీ చేశారు. ఈ నెలలో మొదటి రోజున 48.63 లక్షల మందికి పింఛన్లు అందించారు. ఇది మొత్తం పింఛన్ల సంఖ్యలో 80.4 శాతం. ప్రతి నెలా 10– 20 శాతం మంది పింఛన్‌దారులకు మరుసటి రెండు రోజుల్లో నగదు అందుతోంది. అయితే ఆంధ్రజ్యోతి మాత్రం ఈ నెల మాత్రమే పింఛన్‌ అందరికీ అందిచలేకపోయారని రాసుకొస్తూ.. దానికి నగదు కొరతే కారణమనేలా అసత్యాలను పాఠకుల మదిలోజొప్పించేందుకు యత్నించింది.

Also Read : మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు డిస్మిస్

Show comments