చదువులకు సర్కారు అండాదండ – రేపు అమ్మఒడి ప్రారంభం

చదువే తలరాతను మారుస్తుంది. పేదరికాన్ని జయించాలంటే చదువుతోనే సాధ్యం. . ప్రభుత్వ విద్యపై సర్కారులు సీత కన్ను వేయడంతో పైవేటు, కార్పొరేటర్‌ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి విద్యను వ్యాపారంగా మార్చాయి. చదువు‘కొనే’ సంస్కృతి విశృలంఖంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లల చదువుల కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి కొన్నేళ్లుగా నెలకొంది. రెక్కలు ముక్కలు చేసుకునో లేదా ఆస్తులమ్మో తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇలా చేయలేని కుటుంబాల పిల్లలు ఆదిలోని విద్యకు దూరమై కూలి పనులకు వెళుతున్నారు.

ఈ పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నడుం బిగించారు. పేద, మధ్య తరగతి పిల్లల తల్లులకు ఆర్థిక అండ ఇచ్చేందుకు అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు.
నాడు నేడు పేరుతో సర్కారు బడులకు జవసత్వాలు నింపే పని ఇప్పటికే ప్రారంభించిన జగన్‌ సర్కార్‌ చదవుల విప్లవంలో భాగంగా రేపు మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టుబోతోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుకునే పిల్లల తల్లికి ప్రతి ఏడాది 15 వేల రూపాయలు ఆర్థిక చేయూత ఇచ్చే ‘‘ జగనన్న అమ్మ ఒడి పథకం’’ రేపు చిత్తూరు లో సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.


అందరికీ 15 వేలు..

2019 ఎన్నికలకు రెండేళ్ల ముందే 2017లో వైఎస్‌ జగన్‌ నవరత్నాల పేరుతో 9 పథకాలను ప్రకటించారు. దాదాపు ఏడాదిన్న పాటు సాగిన ప్రజా సంకల్ప పాదయాత్రలో అనేక కుటుంబాల కష్ట నష్టాలు, సమస్యలను స్వయంగా చూసిన సీఎం జగన్‌ మెనిఫెస్టోలో మరిన్ని పథకాలను చేర్చారు. నవరత్నాల్లో మార్పులు చేశారు. తరగతుల వారీగా నగదు ఇవ్వాలని ముందు భావించినా ఆ తర్వాత తరగతులతో సంబంధంలేకుండా విద్యార్థుల తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఇంటర్‌విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేశారు.


42,80,823 – లబ్ధిదారులైన తల్లుల సంఖ్య..

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థి తల్లికి అమ్మ ఒడి పథకం వర్తింపచేస్తున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు వాలంటీర్లు, పాఠశాలల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు 42,80,823 మంది తల్లులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. తొలి జాబితా కింద వీరందరి ఖాతాల్లో రేపు 15 వేల రూపాయలు జమ చేయడం లాంఛనంగా ప్రారంభం కానుంది. వీరుగాక మరో 13, 37, 224 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.


రూ. 6455 కోట్లు – పథకానికి కేటాయింపు…

జగనన్న అమ్మ ఒడి పథకానికి రాష్ట్ర సర్కార్‌ బడ్జెట్‌లో 6,455.80 కోట్ల రూపాయలు కేటాయించింది. 42,80,823 మంది లబ్ధిదారులైన తల్లులకు 6,412.34 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమచేయనున్నారు. పరిశీలనలో ఉన్న13, 37, 224 మంది దరఖాస్తుదారులల్లో అర్హులైన వారికి రెండో విడతలో 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు.


81,72,224 – లబ్ధిపొందే విద్యార్థుల సంఖ్య..

ఆంధ్రప్రదేశ్‌లో 61,271 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 3,083 ఇంటర్‌ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో అమ్మ ఒడి పథకం కింద ప్రస్తుతం మొదటి జాబితాలో 81,72,224 మంది లబ్ధి పొందనున్నారు. ఇందులో ఒకటి నుంచి పదో తరగతి వరకు 72, 77,387 మంది విద్యార్థులుండగా, ఇంటర్‌ విద్యార్థులు 8,94,837 లబ్ధి పొందనున్నారు. ప్రతి ఏడాది అర్హులైన విద్యార్థుల తల్లులకు 15 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తారు. జగన్‌ సర్కార్‌ ఐదేళ్లలో ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద 75 వేల రూపాయల లబ్ధి చేకూరనుంది.

Show comments