మద్దతు అడగడమా…? డిమాండ్ చేయడమా..?

ఎవరైనా తమ డిమాండ్లు నెరవేర్చాలనీ, సమస్యలు తీర్చాలని నిరసనలు, దీక్షలు చేస్తుంటే… వారికి రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలపడం, సంఘీభావం ప్రకటించడం, వారితో కలసి నిరసనల్లో పాల్గొనడం ఒక విధానం. మరో వైపు నిరసనకారులు తమ సమస్యలు చెప్పుకుని ఆయా వర్గాల ప్రముఖల మద్ధతు కోరడం మరో విధానం. ఉద్యమ బాహుళ్యంలో నిన్నటి వరకు ఈ రెండు విధానాలనే చూశాం. ఇప్పుడు మూడో విధానం అమరావతి ఉద్యమంలో చూస్తున్నాం.

తమ ఉద్యమానికి మద్దతు తెలపాలంటూ.. అమరావతి జేఏసీ పేరుపై కొంత మంది వ్యక్తులు, విద్యార్థులు సినీ ప్రముఖుల ఇంటి ముందు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల సినీ నటుడు మహేష్‌ బాబు ఇంటి వద్ద ధర్నాచేసిన అమరావతి ఉద్యమకారులు.. తాజాగా ఈ రోజు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. రాజధాని రైతుల, కూలీల ఆందోళనకు మద్ధతు తెలపాలని వారు బ్యానర్లు పదర్శిస్తూ, నినాదాలు చేశారు. ఉద్యమానికి మద్దతు తెలపకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించడం కొసమెరుపు.

అమరావతి ఉద్యమ జేఏసీ తాజా తీరు పరిశీలిస్తే.. ఉద్యమాన్ని ఎవరో కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. శాంతియుతంగా ఉద్యమాలు చేసే రైతులు..ఇలా సినిమాలనే అడ్డుకుంటామని హెచ్చరింబోరని పేర్కొంటున్నారు. తమకు మద్ధతు తెలపాలని డిమాండ్‌ చేయడం కొత్తగా చూస్తున్నామని, అందుకోసం సినీ నటుల ఇళ్లు, కార్యాలయాల ఎదుట ధర్నా చేయడం మునుపెన్నడూ చూడలేదంటున్నారు. ఇలా చేయడం వల్ల సంపాదించే మద్దతుకు ఎలాంటి బలం ఉండబోదని విశ్లేషిస్తున్నారు. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్, ఆయన కుటుంబాన్ని దుర్భాషలాడేలా మహిళలతో మాట్లాడించి.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడం చూశాం. తాజాగా సినీ ప్రముఖల ఇళ్ల ముందు ఆందోళనలు చూస్తున్నాం. భవిష్యత్‌లో అమరావతి ఉద్యమ పంథాను ఏ రూపానికి తీసుకొస్తారో వేచి చూడాలి.

ప్రజా సమస్యలపై, బడుగులకు మద్ధతుగా ఉద్యమాలు, ఆందోళనలు చేసే కమ్యూనిస్టు పార్టీలు, వారి అధినాయకులు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ సినీ నటులను డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేయడం ఇక్కడ విశేషం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట జరిగిన ఆందోళనలో పాల్గొనడం గమనార్హం. ఈ కార్యక్రమం ద్వారా కమ్యూనిస్టు నాయకులకు రామకృష్ణ సరికొత్త సందేశాన్ని ఇస్తున్నట్లున్నారు.

Show comments