ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం

  • Published - 06:23 AM, Wed - 9 September 20
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం

ఏసీబీ అధికారులకు మరో పెద్ద తిమింగలం చిక్కింది..ఇప్పటికే కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎమ్మార్వో నాగరాజు ఉదంతం మరువక ముందే మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఒక భూమి సెటిల్మెంట్ కేసులో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ నర్సాపూర్ మండలం తిప్పల్ తుర్తిలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసి కోసం 1.40 కోట్ల లంచం డిమాండ్ చేసాడు. అందులో భాగంగా కోటి 12 లక్షల చెక్ రాయించుకోగా మరో కోటి రూపాయల ప్రాపర్టీని తన పేరున రాయించుకున్నారు. కాగా నగేష్ పై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో మూడు చోట్ల దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 1.12 లక్షల చెక్ లభించడంతో పాటు ఆడియో టేపులు కూడా లభించాయి.

బయటకి వస్తున్న అడిషనల్ కలెక్టర్ అక్రమాలు

కాగా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాల నేపథ్యంలో ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మెదక్ జిల్లాలో తన పరిధిలో ఉన్న ఎమ్మార్వో ఆఫీసుల్లో ఒక్కో కొరియర్ ను ఏర్పాటు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తన పరిధిలో ఉన్న ఎమ్మార్వో ఆఫీసుల్లో తన అనుమతి లేకుండా ఒక్కరికి కూడా పాస్ పుస్తకాలు వెళ్లకుండా నగేష్ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. పట్టా పుస్తకాల కోసం ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్లేవారి సమాచారం గురించి కొరియర్లు నగేష్ కు సమాచారం అందిస్తారని తెలుస్తుంది. ఏసీబీ సోదాల నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Show comments