ఒక్కరోజులో 8134 పాజిటివ్ కేసులు-269 మరణాలు
దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాజిటివ్ కేసులు నిర్దారణ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,134 కేసులు, 269 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,73,490 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4980 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వైరస్ బయటపడ్డ తరువాత 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం అత్యదిక మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ బారినుండి 82,627 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 85,873 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో 2682 పాజిటివ్ కేసులు నిర్దారణ
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు.గత కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2682 పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతుంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 62,228 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 2098 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 36,932 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 1,173 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 169 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 2425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కేసుల్లో ఇదే అత్యధికం.. 973 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1381 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 71 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 85 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 3330 కి మందికి కరోనా సోకగా 60 మంది మృత్యువాత పడ్డారు. 2234 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,036 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 6,030,435 మందికి కోవిడ్ 19 సోకగా 366,809 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 2,659,250 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,793,530 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 104,542 మంది మరణించారు.