P Venkatesh
P Venkatesh
మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో భారత్ లోని మహిళా లోకం ఆనందం వ్యక్తం చేస్తుంది. కాగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాజాగా భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. దీంతో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట రూపం దాల్చింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడంతో సామాన్య మహిళలు సైతం రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. మహిళలు రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఈ బిల్లు దోహదపడనున్నది.
ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లుపై చర్చ అనంతరం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆ తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంతకం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం సమర్పించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంతకం చేయడంతో చట్టంగా మారింది. ఈ బిల్లు చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తుంది. అయితే ఈ బిల్లు ఇప్పుడే అమల్లోకి రాదు.. జనాభా లెక్కల ప్రకారం లోకసభ, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ తర్వాత ఈ బిల్లు అమలులోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది.