వీల్‌ ఛైర్‌లో రాజ్యసభకు వచ్చిన మన్మోహన్‌ సింగ్‌.. BJP-కాంగ్రెస్‌ మధ్య వార్‌!

పార్లమెంటు వర్షాకాల సమవేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్‌సభలో.. విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద చర్చ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు హాజరయ్యారు. ఢిల్లీ సర్వీస్‌ బిల్లుపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పెద్దల సభకు వచ్చారు మన్మోహన్‌. వీల్‌ చైర్‌లో ఉండి కూడా ఆయన రాజ్యసభకు రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం మన్మోహన్‌ వీల్‌ చైర్‌లో కూర్చుని రాజ్యసభకు హాజరైన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. చాలా రోజుల తర్వాత మన్మోహన్‌ మీడియా ముందుకు రావడం పట్ల అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మన్మోహన్‌ రాక.. బీజేపీకి కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల మధ్య వాగ్వాదం రాజేసింది.

90 ఏళ్ల వయసులో.. అది కూడా వీల్‌ ఛైర్‌లో కూర్చుని ఉన్నప్పటికి కూడా.. మన్మోహన్‌ రాజ్యసభకు హాజరవ్వడం ఆయన పట్టుదల, దేశ ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యతను తెలియజేస్తుంది అంటూ కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ప్రశంసలు కురిపిస్తుండగా… బీజేపీ నేతలు మాత్రం సానుభూతి పొందడానికి ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ వాడుతున్నారంటూ విమర్శులు చేస్తోంది.

ఈ సందర్భంగా బీజేపీ తన అధికారిక ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చింది. ‘‘ఈ దేశం కాంగ్రెస్‌ పార్టీ చేస్తోన్న పిచ్చి పనులను జ్ఞాపకం ఉంచుకుంటుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇలాంటి తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికి కాంగ్రెస్‌ నాయకులు.. దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా.. ఆయనను సభకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేశారు. నిజంగా ఇది సిగ్గు చేటు’’ అంటూ విమర్శించింది.

అయితే బీజేపీ విమర్శలపై కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ చైర్‌పర్సన్‌ సుప్రియా శ్రీనతే స్పందిస్తూ.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు హాజరయ్యి.. ప్రజాస్వామ్యం పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. అంతేకాక దేశ రాజ్యంగం పట్ల తన నమ్మకాన్ని తెలియజేయడం కోసం ఆయన ఈ రోజు ఇక్కడకు వచ్చారు. ఇదే బీజేపీ దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన తన పార్టీ సీనియర్‌ నేతలను పక్కకు తప్పించి.. వారిని మానసిక వేదనకు గురి చేస్తోంది. పెద్దలను ఎలా గౌరవించాలో మీ మాస్టర్‌కు చెప్పండి’’ అంటూ బీజేపీకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఇక మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభకు హాజరవ్వడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వీల్‌ఛైర్‌లో కూర్చుని రాజ్యసభకు హాజరైన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Show comments