ఫిల్మ్ ఇండస్ట్రీలో మేనేజర్లది చాలా కీలక పాత్ర. యాక్టర్స్‌కు, ప్రొడ్యూసర్లకు మధ్య వీళ్లు వారధుల్లా పని చేస్తుంటారు. హీరో, హీరోయిన్ల కాల్షీట్స్ వీరి చేతుల్లోనే ఉంటాయి. నటీనటుల డేట్స్ మొదలుకొని, పారితోషికం వరకు అన్నీ వీళ్లే దగ్గరుండి చూసుకుంటారు. యాక్టర్స్ కూడా వీళ్లు ఏది చెబితే అది ఫాలో అయిపోతుంటారు. అందుకే డైరెక్టర్లు, నిర్మాతలు మేనేజర్ల వెంబడి పరుగులు తీస్తుంటారు. మీ హీరోతో మా మూవీ సెట్ చేయండంటూ కోరుతుంటారు. కాల్షీట్స్ నుంచి రెమ్యూనరేషన్ వరకు అంతా మేనేజర్లే చూసుకోవాలి కాబట్టి.. స్టార్ యాక్టర్స్ చాలా నమ్మకస్తులను ఈ జాబ్ కోసం నియమించుకుంటారు.
స్టార్ హీరో, హీరోయిన్లతో మేనేజర్లు ఏళ్ల తరబడి స్నేహబంధాన్ని కొనసాగిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ కూడా ఒకరు. షారుఖ్ దగ్గర 2012 నుంచి పూజ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బాలీవుడ్ బాద్షా సినిమా వ్యవహారాలతో పాటు వ్యక్తిగత విషయాల్లోనూ ఆమె సలహాలు ఇస్తుంటారట. పదేళ్లకు పైగా షారుఖ్‌తో కలసి పని చేయడంతో ఆయన కుటుంబంతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ అయితే పూజను సొంతింటి మనిషిలా చూసుకుంటుందట. కొందరు సెలబ్రిటీల పార్టీలకు పూజతో గౌరీ కలసి వెళ్లడం గమనార్హం.
షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. ఈ మూవీ ప్రమోషన్ల విషయంలోనూ ఆయన మేనేజర్ పూజా దద్లానీ కీలకంగా వ్యవహరించారు. అలాంటి పూజ జీతం ఎంతనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ యాక్టర్స్‌లో ఒకరైన షారుఖ్.. తన ఆర్థిక వ్యవహారాలు చూసుకొనే పూజా దద్లానీకి భారీ వేతనాన్ని అందిస్తున్నారట. సంవత్సరానికి రూ.7 నుంచి రూ.9 కోట్ల వరకు పూజ శాలరీ ఉంటుందని బాలీవుడ్ టాక్. మేనేజర్‌గానే గాక పలు వ్యాపారాలు కూడా కలిగిన పూజా దద్లానీ సంపద నికర విలువ రూ.50 కోట్ల దాకా ఉంటుందని సమాచారం.
ఇదీ చదవండి: మరిముత్తు యాదృచ్ఛికంగా ఫొటో దిగితే.. అదే నిజమైంది!