ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ మూవీనే ‘కేజీఎఫ్’. కన్నడ సినిమా పవర్‌ను చూపించిందీ చిత్రం. కమర్షియల్ మూవీకి ఈ ఫిలింతో కొత్త డెఫినిషన్ చెప్పాడు ప్రశాంత్ నీల్. సాధారణంగానే సౌత్ సినిమాల్లో హీరోలకు బాగా ఎలివేషన్స్ ఇస్తుంటారు. అలాంటిది ‘కేజీఎఫ్’లో కథానాయకుడైన రాకీ పాత్రకు నీల్ ఇచ్చిన ఎలివేషన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్.. అంతా వేరే లెవల్ అని చెప్పాలి. ‘కేజీఎఫ్’ ఒక్క కన్నడ నాటే కాదు.. తెలుగు, తమిళం, హిందీల్లోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘కేజీఎఫ్’ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
‘కేజీఎఫ్’తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ నుంచి తర్వాతి చిత్రం కోసం ఆడియెన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ మూవీ కోసం ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ను ఎంచుకున్నాడు ప్రశాంత్ నీల్. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమే ‘సలార్’. ఈ పాన్ ఇండియా మూవీ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన ఆడియెన్స్ వెయిటింగ్‌కు ఎట్టకేలకు తెరపడింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తూ ఇవాళ ఉదయం ‘సలార్’ టీజర్ రిలీజైంది. యూట్యూబ్‌ను ఈ టీజర్ ఇప్పుడు షేక్ చేస్తోంది. 1 నిమిషం 46 ఆరు సెకన్ల పాటు ఉన్న ప్రభాస్ కొత్త మూవీ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీక్వెన్సులతో నింపేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఇందులో ప్రభాస్ లుక్‌ను పూర్తిగా చూపించలేదు. అయినా ఇంట్రడక్షన్, ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉన్నాయి.
‘సలార్’ టీజర్లో మూడు విషయాలను గమనిస్తే అవి అచ్చం ‘కేజీఎఫ్’లాగే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తన గత సినిమా మాదిరిగానే అదే దుమ్ము.. అదే బ్లాక్ బ్యాగ్రౌండ్‌ను ఈ మూవీకి ఎంచుకున్నారని అర్థమవుతోంది. ‘కేజీఎఫ్ 2’లో యష్ ఇంట్రడక్షన్ మాదిరిగానే ఇందులోనూ ఒక పెద్దాయనతో ఇంగ్లీష్‌లో ప్రభాస్ ఇంట్రో డైలాగ్ ఉంటుంది. గత సినిమా ఫార్ములానే ఇక్కడ కూడా వాడేశారు నీల్. ఈ మూవీని కూడా ‘కేజీఎఫ్’లానే రెండు పార్టులుగా తీయనున్నట్లు టీజర్ ఆఖర్లో క్లారిటీ ఇచ్చేశారు. ‘సలార్’ టీజర్లో ప్రభాస్ పూర్తి లుక్‌ను కాకుండా కేవలం వెనుక నుంచి ఆయన పిడికిలిని మాత్రమే చూపించారు. ఇదంతా ‘కేజీఎఫ్’ను పోలి ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘సలార్’ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.