Jr NTR వీరాభిమాని శ్యామ్‌ మృతి.. మంచి మనసు చాటుకున్న తారక్‌ అభిమానులు!

Jr NTR వీరాభిమాని శ్యామ్‌ మృతి.. మంచి మనసు చాటుకున్న తారక్‌ అభిమానులు!

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా, కొప్పిగుంటకు చెందిన శ్యామ్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. మరి ఏం జరిగిందో తెలిదు కానీ.. శ్యామ్ చింతలూరు గ్రామంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు.. శ్యామ్‌ది ఆత్మహత్య అని తేల్చగా.. కుటుంబానికి సభ్యులు మాత్రం.. శ్యామ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్‌ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతి చెందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబానికి తారక్ అభిమానులు అండగా నిలుస్తున్నారు. శ్యామ్ చెల్లెలి బాధ్యత తమేదనంటూ ఎన్టీఆర్ పేరిట ఆయన అభిమానులు నెలకొల్పిన ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. తారక్‌ అభిమానులు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఏంటీ సంస్థ..

మూడేళ్ల క్రితం ఎన్టీఆర్ అభిమానులు కొంత మంది కలిసి ‘RAW NTR’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. 2020 నవంబర్ 23న ఈ స్వచ్ఛంద సంస్థను అధికారికంగా రిజిస్టర్ చేశారు. 2021 జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 365 రోజుల పాటు అనగా.. ఏడాది మొత్తం అన్నదాన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్థ ఏడాది మొత్తం అన్నదానం చేస్తోంది.

అనాథలు, రోడ్డు పక్కన జీవించే నిరుపేదలకు, వృద్ధాశ్రమాలకు, అంధ విద్యార్థులకు, కూడూగుడ్డకు నోచుకోని చిన్నారులకు ఈ సంస్థ ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది. ఎన్టీఆర్ మాటల స్ఫూర్తితో ఈ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పినట్లు ఆయన అభిమానులు చెబుతుంటారు. అలాంటి సంస్థ ఇప్పుడు శ్యామ్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది.

‘‘శ్యామ్‌ మృతి విచారకరం. అయితే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కానీ, శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం. ఇప్పటికే శ్యామ్ తల్లిదండ్రులతో మాట్లాడాం. వాళ్లకి అన్ని విధాలుగా అండగా ఉంటామని.. ధైర్యం చెప్పాం. శ్యామ్ తన కుటుంబానికి వెన్నెముక లాంటోడు. తను లేని లోటు ఆ కుటుంబానికి మనమెవ్వరం తీర్చలేము. అందుచేత, శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మేము తీసుకున్నాం. అలాగే, జరిగిన సంఘటన మీద పోలీసు శాఖను స్పష్టమైన దర్యాప్తు చేయమని కోరుతున్నాం’’ అని RAW NTR ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఈ స్వచ్ఛంద సంస్థ తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ నిర్ణయం గురించి తెలుసుకుని.. హర్షం వ్యక్తం చేస్త్ననారు. RAW NTR చేసిన ట్వీట్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రీట్వీట్ చేశారు. నమస్కారం పెడుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. అలాగే, చిన్న సినిమాల నిర్మాత ఎస్కేఎన్ కూడా స్పందించారు. ‘గొప్ప నిర్ణయం, హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ చేశారు.

Show comments