అది నేను కాదు.. శామీర్‌ పేట ఘటనపై స్పందించిన నటుడు మనోజ్‌ కుమార్‌!

శామీర్‌పేట సెలెబ్రిటీ క్లబ్‌లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై.. సీరియల్‌ నటుడు మనోజ్‌ కుమార్‌ స్పందించారు. ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వేరే వ్యక్తి ఫొటోకు బదులు తన ఫొటో వాడుతున్నారంటూ మండిపడ్డారు. తన పరవును దిగజార్చేలా కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నా పేరు మనోజ్‌ కుమార్‌. కొంతమందికి తెలిసే ఉంటుంది. నేను కార్తీకదీపంలో ప్రేమ్‌గా నటించాను.  ఇప్పుడు మౌనపోరాటంలో నటిస్తున్నాను.

మార్నింగ్‌ నుంచి ఓ ఫేక్‌ న్యూస్‌ సర్య్కులేట్‌ అవుతోంది. మనోజ్‌ నాయుడు అనే వ్యక్తి సిద్ధార్థ్‌ అనే వ్యక్తిపై గన్‌ఫైర్‌ చేశాడు అని. మనోజ్‌ నాయుడు.. నేను అనుకుని నా ఫొటోల్ని వాడుతున్నారు. వార్తల్ని సర్య్కులేట్‌ చేస్తున్నారు. మార్నింగ్‌ కాల్స్‌ వచ్చాయి. ప్రాంక్‌ కాల్‌ అనుకున్నా. నేను బెంగళూరులో ఉన్నాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. నాకు, ఈ కేసుకు ఏ సంబంధం లేదు. ఆ మనోజ్‌ నాయుడు నేను కాదు. కొన్ని మీడియా సంస్థలు వార్తలు పూర్తిగా తెలుసుకోకుండా నా ఫొటోల్ని వాడాయి. వాటిపై నేను కేసు పెడతా..

నా పరువుకు భంగం కలిగించారు. అదొక ఫేక్‌ న్యూస్‌’’ అని అన్నారు. మనోజ్‌ కుమార్‌ ఇచ్చిన క్లారిటీతో ఫేక్‌ వార్తలకు చెక్‌ పడ్డట్టు అయింది. శామీర్‌ పేట సెలెబ్రిటీ క్లబ్‌ కాల్పుల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌ అతడి భార్య స్మిత గొడవల కారణంగా 2009నుంచి వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్మితకు మనోజ్‌తో పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ 2019నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సిద్ధార్థ్‌కు, మనోజ్‌కు గొడవైంది. గొడవ సందర్భంగా మనోజ్‌ ఎయిర్‌ గన్‌తో కాల్పులు జరిపాడు.

Show comments