హృదయ విదారకర సంఘటన.. కారులో ఇరుక్కున్నా వదల్లేదు!

మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు తగ్గిపోతోంది. ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకోవటం మానేసి.. కొందరు క్రూరంగా ప్రవరిస్తున్నారు. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. దొంగతనాన్ని అడ్డుకోబోయిన ఓ వ్యక్తితో దారుణంగా ప్రవర్తించారు కొందరు దండుగులు. అతడ్ని కారుతో పాటు ఈడ్చుకెళ్లారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..

న్యూఢిల్లీ.. ఫరిదాబాద్‌కు చెందిన బిజేందర్‌ సింగ్‌ అనే 43 ఏళ్ల వ్యక్తి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లోకల్‌లోనే ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలానే మంగళవారం కూడా ట్యాక్సీ తోలడానికి బయటకు వచ్చాడు. రాత్రి సమయంలో కొంతమంది దుండగులు బిజేందర్‌ సింగ్‌ ట్యాక్సీ దగ్గరకు వచ్చారు. అతడిపై దాడి చేసి కారును దొంగిలించే ప్రయత్నం చేశారు. అయితే, బిజేందర్‌ తిరగబడ్డాడు. ఆ దుండుగులు అతడిని మరింత దారుణంగా కొట్టారు. కారు స్టార్ట్‌ చేసి ముందుకు వెళ్లబోయారు.

ఈ నేపథ్యంలోనే బిజేందర్‌ సింగ్‌ చేతులు కారు డోరులో ఇరుక్కుపోయాయి. దీంతో కారు అతడి శరీరాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లసాగింది. అతడు బాధతో గట్టిగా అరవసాగాడు. అయినా కూడా కారులో ఉన్న దొంగలు కనికరించలేదు. కొంతదూరం అలానే ఈడ్చుకెళ్లారు. తీవ్రగాయాలపాలైన బిజేందర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత వాళ్లు అతడి శవాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బిజేందర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ఇలా రోడ్లపై దారుణాలకు పాల్పడే వారిని ఉరి తీయాలి’’..‘‘ మానవత్వం లేని మనుషులు వారిని కఠినంగా శిక్షించాలి’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయానలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments