తీవ్ర విషాదం : కరెంట్‌ షాక్‌తో ఒకే కుటుంబంలో నలుగురు మృతి!

మరణం ఎప్పుడు? ఎలా? ఎవర్ని పలకరిస్తుందో ఎవరమూ చెప్పలేము. అప్పటి వరకు నవ్వుతూ తుళ్లుతూ ఉన్న వారు.. ఉన్నట్టుండి చనిపోతుంటారు. చావుకు సొంతం, బంధం అంటూ ఏదీ ఉండదు. తాజాగా, మృత్యువు కరెంట్‌ రూపంలో ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. ఏకంగా ఆ కుటుంబంలోని నలుగుర్ని బలితీసుకుంది. ఈ నలుగురిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన రాజస్తాన్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్‌, బార్మర్‌ జిల్లాలోని రామ్‌దేవ్‌పూర్‌ గ్రామానికి చెందిన అర్జున్‌ ఉపాధి నిమిత్తం తన భార్య, ఇద్దరు పిల్లల్ని గ్రామంలోనే వదిలి ఢిల్లీ వెళ్లాడు. వీరికి తోడుగా అర్జున్‌ తండ్రి ఉంటున్నాడు. అర్జున్‌ భార్య ఇంట్లో పిండి మర నిర్వహిస్తోంది. శుక్రవారం రాత్రి  అర్జున్‌ భార్య పిండి మర దగ్గర పని చేస్తోంది. ఏమైందో ఏమో కానీ, ఆమెకు షాక్‌ తగిలింది. దీంతో ఆమె గట్టిగా కేక వేసి గిలగిల్లాడసాగింది. తల్లి అరుపులు విన్న పిల్లలు పరుగున ఆమె దగ్గరకు వెళ్లారు. తల్లిని పట్టుకోవటంతో వారికి కూడా కరెంట్‌ షాక్‌ తగిలింది. వారు కూడా కేకలు పెట్టి గిలగిల్లాడసాగారు. వారి అరుపులు విన్న అర్జున్‌ తండ్రి అక్కడికి పరుగున వచ్చాడు.

ఆయన కూడా ఏమీ ఆలోచించకుండా వారిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఇలా నలుగురు ఒకరితర్వాత ఒకరు కరెంట్‌ షాక్‌తో బలయ్యారు. స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ విషాదం నెలకొందని పోలీసులు తెలిపారు. ఇక, ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు చనిపోవటంతో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments