Venkateswarlu
Venkateswarlu
ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు(ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ నూతన లోగో, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆప్కాబ్ నిలబడిన పరిస్థితి చూస్తే తనకు గర్వంగా ఉందని అన్నారు. ఆప్కాబ్‌లో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోందని తెలిపారు.
రైతులకు ఆప్కాబ్ ఇస్తున్న చేయూత ఎనలేదనిదంటూ ప్రశంసలు కురిపించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆప్కాబ్ ద్వారానే రైతులకు చేరువైందని అన్నారు. మహానేత వైఎస్సార్ సహకార వ్యవస్థను బలోపేత చేశారని చెప్పారు. ఆయన ఆప్కాబ్‌లో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. సహకార బ్యాంకులు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయని వెల్లడించారు. రైతుల చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఆర్‌బీకేలను ఆప్కాబ్‌తో అనుసంధానం చేశామని వెల్లడించారు.
డిజిటలైజేషన్ కారణంగా బ్యాంకు సేవలు మరింత వేగంగా ప్రజలకు చేరుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి మార్పులు చూస్తామని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకులు 1963లో ప్రారంభం అయ్యాయి. మొదటి నుంచి చిన్న, సన్నాకారు రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తున్నాయి. ఇక, ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు పరిధిలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి. వీటితో పాటు 1995 ప్రాథమిక వ్యవసాయం పరపతి సంఘాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు టర్నోవర్ పెరుగుతూ వస్తోంది.