Venkateswarlu
Venkateswarlu
సాధారణంగా దేవుడి హుండీలో డబ్బులు, ఇతర కానుకలు వేయటం సహజం. ఒక్కోసారి హుండీలో చెక్కులు కూడా పడుతూ ఉంటాయి. తాజాగా, సింహాచలం అప్పన్న స్వామి హుండీలో కూడా ఓ చెక్ పడింది. ఆ చెక్ చూసి డబ్బులు లెక్కపెట్టే సిబ్బందితో పాటు ఆలయ ఈవో కూడా ఎంతో సంబరపడ్డాడు. అది లక్ష.. రెండు లక్షల చెక్కు కాదు.. ఏకంగా వంద కోట్ల రూపాయల చెక్. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, వారి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. దాన్ని బ్యాంకుకు పంపగా అసలు ట్విస్ట్ తెలిసి షాక్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..
కొద్దిరోజుల క్రితం సింహాచలం కొండపై కొలువై ఉన్న సింహాచలం అప్పన్నస్వామి హుండీ లెక్కింపు జరిగింది. హుడీ లెక్కిస్తున్న సిబ్బందికి ఓ చెక్ కనిపించింది. ఆ చెక్ చూసి వారు ఎంతో సంతోషించారు. బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి దాదాపు 100 కోట్ల రూపాయలకు ఆ చెక్కును రాసి హుండీలో పడేశాడు. ఆలయ చరిత్రలో అదే పెద్ద మొత్తం కావటంతో వారు ఎంతో సంతోషించారు. దాన్ని ఈవో దగ్గరకు తీసుకెళ్లగా ఆయన కూడా ఎంతో సంతోషించాడు. అయితే, అంత పెద్ద మొత్తం ఉన్న ఆ చెక్కు చెల్లుతుందా? లేదా? అన్న అనుమానం ఆయనకు కలిగింది.
దీంతో ఆయన ఆ చెక్‌ను బ్యాంకుకు పంపి ఆరా తీశారు. తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. 100 కోట్లకు చెక్ ఇచ్చిన ఆ భక్తుడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నట్లు తేలింది. దీంతో ఆలయ అధికారులు షాక్ తిన్నారు. రాధాకృష్ణ అడ్రస్ అడుగుతూ బ్యాంకుకు లేఖ రాశారు. అతడు ఉద్దేశ్యపూర్వకంగానే హుండీలో చెక్ వేసి ఉంటే.. చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. మరి, అకౌంట్‌లో 20 రూపాయలు కూడా లేకపోయినా.. హుండీలో 100 కోట్ల చెక్ వేసిన సదరు భక్తుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.