రోడ్‌ మ్యాప్‌పై ఇంకా క్లారిటీ రాలేదా?

రోడ్‌ మ్యాప్‌పై ఇంకా క్లారిటీ రాలేదా?

జనసేన- బీజేపీల మధ్య రోడ్‌ మ్యాప్‌ విషయంలో ఇంకా క్లారిటీ వచ్చినట్టు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నిలువరించడానికి బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తమ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై ఆ మర్నాడే స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చే ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో తమకు పార్టీ సీనియర్‌ నేత అమిత్‌ షా రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేశారని ప్రకటించారు. పొత్తులకు సంబంధించి తమ భాగస్వామి పార్టీ అయిన జనసేన అధినేత పవన్‌ ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ పెద్దలతో సంప్రదిస్తారని కూడా చెప్పారు. అయితే ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గద్దె దించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని అన్నారు. బీజేపి జనసేన కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని మరోమారు స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు వుంటుందని మేము చెప్పలేదు, మీరనుకుంటున్నారు అంటూ మీడియానుద్దేశించి అన్నారు.

బీజేపీది వన్‌సైడ్‌ లవ్వా..

అమిత్ షా రోడ్డు మ్యాప్‌ ఆల్‌ రెఢీ ఇచ్చేశారని చెప్పిన సోము ఇప్పుడు ఇంకా సిద్ధం చేస్తున్నామని ప్రకటించడంతో దానిపై ఆయనకే ఇంకా క్లారిటీ లేదా? అన్న అనుమానం వస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఇష్టంలేని కాపురంలా సాగుతోందా? అన్న అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ ఎన్నికలు, ఆ తర్వాత తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో వీరు కలసి పయనించలేదు. మొన్న 14వ తేదీన జరిగిన జనసేన ఆవిర్భావ సభలో మిత్రపక్షమైన బీజేపీ నేతలు ఎవరూ పాల్గొనలేదు. అయితే శనివారం కడపలో బీజేపీ నిర్వహించిన రాయలసీమ రణభేరి సభలో మాత్రం జనసేన ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే తమ పార్టీ ఆవిర్భావ సభకు బీజేపీ నేతలను పవన్‌ ఆహ్వానించకపోయినా కమలనాథులు జనసేన నేతలను రణభేరికి పిలిచారని అర్థమవుతోంది. రణభేరి సభలో కూడా పదే పదే జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని బీజేపీ నేతలు చెప్పుకోవడం గమనార్హం. అంటే పవన్‌ విషయంలో బీజేపీది వన్‌సైడ్‌ లవ్‌ ఏమో అన్న అనుమానాలు వస్తున్నాయి.

పవన్‌ కలసి వస్తారా?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు తెచ్చుకున్న జనసేన, ఒక శాతం ఓట్లు సాధించిన బీజేపీ పొత్తు పెట్టుకుని బలమైన వైఎస్సార్‌ సీపీని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే పకడ్బందీ వ్యూహం ఉండాలి. ఆ ఎన్నికల్లో టీడీపీ 39 శాతం ఓట్లు సాధించింది. అయితే టీడీపీతో పొత్తు ఉండదని సోము ఒకపక్క చెబుతూనే ఇంకా రోడ్డు మ్యాప్‌ రూపొందించే దశలోనే ఉన్నామని చెప్పడం గమనార్హం. టీడీపీ – బీజేపీల మధ్య సఖ్యత సాధించగలనని పవన్‌ ఇప్పటికీ ఆశ పడుతుండగా, కమలనాథులు అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో పవన్‌ బీజేపీతో కలసి పయనిస్తారా అన్న సందేహాలు ఉన్నాయి. పవన్‌ తమతో కలసి వస్తారో? లేదో? సరిగ్గా  తేల్చుకోకుండా సోము వీర్రాజు రోడ్డు మ్యాప్‌ సిద్ధం చేసి మాత్రం ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Show comments