ఆదిపురుష్ రిపేర్లకు 100 కోట్లా..

ఆదిపురుష్ రిపేర్లకు 100 కోట్లా..

  • Updated - 04:22 PM, Wed - 2 November 22
ఆదిపురుష్ రిపేర్లకు 100 కోట్లా..

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాక ఆది పురుష్ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. మీడియా మొత్తం పోస్ట్ పోన్ న్యూస్ గురించి కోడై కూసినా నిర్మాణ సంస్థ టి సిరీస్ మాత్రం మౌనంగా ఉండిపోయింది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా చేయడం పట్ల బాగా ఆగ్రహంగా ఉన్నారు. బాహుబలి నుంచి ప్రతి సినిమాకు ఇలాగే జరుగుతోందని, సరైన ప్లానింగ్ లేకుండా డేట్లు ఎందుకు  ప్రకటిస్తారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామనవమికి రాబోయే మార్చిలో ప్లాన్ చేసుకుంటారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు సాధ్యమో పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యాకే క్లారిటీ వస్తుంది. తాజాగా ముంబై టాక్ ప్రకారం ఆది పురుష్ టీమ్ విఎఫెక్స్ రిపేర్ల పనిలో పడిందట.

టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో అదనంగా మరో వంద కోట్లు కేటాయించి వేరే సంస్థ ద్వారా సిజిని సరిచేయించబోతున్నట్టు వినికిడి. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్లే రజనీకాంత్ విక్రమసింహ దారుణంగా దెబ్బ తింది. అవతార్ కూడా ఈ సాంకేతికను వాడే సినిమానే. కాకపోతే అందులో ఉండే క్వాలిటీ వేరే లెవెల్. యాక్టర్స్ తో నటింపజేస్తూనే అధిక శాతం యానిమేషన్ వాడి నిజమైన మోషన్ జరుగుతున్నట్టుగా భ్రమింపజేసే మేజిక్కే ఈ మోషన్ క్యాప్చర్. ఆది పురుష్ టీమ్ తొలుత ఈ విషయాన్ని దాచి పెట్టడమే ఈ సమస్యకు మూల కారణం.

ఏదో ఎలా ఉన్నా ఇలా మరమ్మత్తులకు పూనుకోవడం మంచి విషయమే. ఎందుకంటే డిసెంబర్ 16న అవతార్ 2 వచ్చాక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా టాప్ స్టాండర్డ్ అంటే ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసిరానుంది. దాన్ని అందరూ మర్చిపోయాకే ఆది పురుష్ లాంటివి వస్తే బెటర్. లేకపోతే అనవసరమైన పోలికలు వచ్చి సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడాల్సి వస్తుంది. అజయ్ అతుల్ సంగీతం సమకూరుస్తున్న ఈ రామాయణగాథకు సంబంధించిన పాటలు కూడా ఇంకా విడుదల చేయలేదు. ప్రభాస్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ ల నుంచి మరికొన్ని డేట్లు అదనంగా తీసుకుని కొంత భాగం రీ షూట్ చేస్తారనే టాక్ కూడా ఉంది. చూడాలి మరి ఏం చేస్తారో..

Show comments