జగ్గారెడ్డిపై వేటు.. కాంగ్రెస్‌లో ముసలం మొదలవుతుందా..?

జగ్గారెడ్డిపై వేటు.. కాంగ్రెస్‌లో ముసలం మొదలవుతుందా..?

సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డిపై వేటు వేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి ఆయన్ను తప్పిస్తూ హస్తం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పదవితోపాటు పార్లమెంట్‌ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా తప్పించింది. మొత్తంగా పార్టీలోని అన్ని పదవుల నుంచి జగ్గారెడ్డిని తప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి, తెలంగాణ పార్టీ ఇంఛార్చి మాణిక్కం ఠాగూర్‌కు వ్యతిరేకంగా ‘కాంగ్రెస్‌ విధేయుల ఫోరం’ పేరుతో సమావేశం నిర్వహించిన మరుసటి రోజే.. జగ్గారెడ్డిపై వేటుపడడం విశేషం.

అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్‌లో నేతలు స్వేచ్ఛగా మాట్లాడుతుంటారు. తమ అభిప్రాయాలను, భావాలను నిర్మొహమాటంగా చెబుతుంటారు. అధిష్టానంపై పూర్తి విశ్వాసం, విధేయతను చూపుతూ ఆయా నేతలు స్థానికంగా ఉన్న నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై, తమకు ప్రాధాన్యత లేని అంశంపై అసంతృప్తిని వెళ్లగక్కుతుంటారు. ఆ క్రమంలో ఎవరిపైనా కఠినమైన చర్యలు తీసుకున్న చరిత్ర కాంగ్రెస్‌లో లేదు. అయితే జగ్గారెడ్డి విషయలో కాంగ్రెస్‌ పార్టీ తన సహజసిద్ధ స్వభావానికి భిన్నంగా వ్యవహరించిందని చెప్పవచ్చు.

సీనియర్‌ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి పీసీసీ పదవిని ఆశించారు. అయితే అధిష్టానం ఆయనకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలను అప్పగించింది. పదవి ఉన్నా తనకు ప్రాధాన్యత లేదని, నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్నారంటూ జగ్గారెడ్డి చాలాకాలం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ రేవంత్‌ రెడ్డి పైన, ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌పైన రగిలిపోతున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక బాధ్యతలను జగ్గారెడ్డికి అప్పజెప్పినా.. ఆయన ప్రమేయం లేకుండా అభ్యర్థిని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

పార్టీ చేపట్టదలిచిన కార్యక్రమాలు, ప్రజా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను తమ ప్రమేయం లేకుండానే నిర్ణయిస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతం చేసేందుకంటూ సీనియర్లతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సమావేశం వద్దని ఏఐసీసీ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చినా.. జగ్గారెడ్డి తగ్గలేదు. మీడియాతో మాట్లాడుతూ మాణిక్కం ఠాగూర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డిపైనా విమర్శలు చేశారు. ఈ క్రమంలో జగ్గారెడ్డిపై వేటు వేయాలంటూ కాంగ్రెస్‌లోని రేవంత్‌ రెడ్డి వర్గం డిమాండ్‌ చేసింది. గంటల వ్యవధిలోనే జగ్గారెడ్డిపై వేటు వేస్తూ నిర్ణయం వెలువడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. సీనియర్‌ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డిపై వేటు తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.

Show comments