చెట్టుకు పుట్టిన రోజు వేడుక చేసిన మంత్రి.. ఆ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే..

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఓ చెట్టుకు ఘనంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. మనిషికి ఎలా అయితే పుట్టిన రోజును జరిపిస్తారో అలానే..చెట్టుకు కూడా బెలూన్లు, కేకు కటింగ్‌తో పుట్టిన రోజు జరిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి చెట్టుకు పుట్టిన రోజు వేడుక జరపటం ఏంటి? ఆ మొక్కలో అంత ప్రత్యేక ఏముంది? అని అనుకుంటున్నారా? ఆ మొక్క నిజంగానే చాలా ప్రత్యేకమైనది.. దాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నాటారు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నిజామాబాద్‌ జిల్లా, వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో ఓ మొక్క నాటారు. ఎనిమిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే.. 6-7-2015లో కేసీఆర్‌ ఈ మొక్కను నాటారు. గురువారంతో ఆ మొక్క ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని, 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ నాటిన ఆ మొక్కకు పుట్టిన రోజు వేడుక చేయాలని మంత్రి భావించారు. గురువారం ఉదయం ఆ మొక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి స్వయంగా ఆయనే కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ‘‘ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయం. ఇది ఓట్ల కోసం చేసేది కాదు. భావి తరాల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణపైనే సమస్త మానవాళి మనుగడ ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టారు. కోట్లాది మొక్కలు నాటించారు’’ అని అన్నారు. మరి, చెట్టుకు మంత్రి పుట్టిన రోజు వేడుక చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments