Venkateswarlu
Venkateswarlu
వాట్సాప్ ప్రతీ మనిషి జీవితంలో ఓ నిత్యావసరంగా మారిపోయింది. ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉండనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. తమ కస్టమర్ల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్లను తీసుకువస్తోంది. నిత్యం ఏదో ఒక కొత్త అప్‌డేట్ కస్టమర్లను పలకరిస్తూనే ఉంది. తాజాగా, వాట్సాప్ వీడియోకాల్‌లో స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
సాధారణంగా వీడియో కాల్ మాట్లాడుతున్నపుడు మన స్క్రీన్‌ను ఇతరులతో షేర్ చేయటం కుదరదు. కానీ, ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన ఈ ఫీచర్ ద్వారా మనం వీడియో కాల్ సమయంలో స్క్రీన్‌ను షేర్ చేసుకోవచ్చు. జూమ్, గూగుల్ మీట్‌లకు పోటీగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు! వీడియో కాల్ సమయంలో లాండ్‌స్కేప్ మోడ్‌ను కూడా పెట్టుకునే సౌలభ్యం వాట్సాప్ వీడియో కాల్‌లో అందుబాటులో ఉంది.
కాగా, వాట్సాప్‌లో వీడియో కాలింగ్ ఫీచర్ దాదాపు ఆరేళ్లనుంచి అందుబాటులో ఉంది. 2016 నవంబర్ నెలలో ఆ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మార్కెట్‌లో కాంపిటీషన్‌ను తట్టుకోవటానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. కేవలం స్మార్ట్‌ఫోన్లలోనే కాకుండా.. డెస్క్‌టాప్‌లలో కూడా వాట్సాప్‌ను వాడుకునే సౌలభ్యాన్ని తీసుకువచ్చింది. మరి, వాట్సాప్ అందుబాటులోకి తెచ్చిన వీడియోకాల్‌లో స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.