చెక్ రివ్యూ

గత సంవత్సరం సరిగ్గా లాక్ డౌన్ కు ఒక నెల ముందు భీష్మ రూపంలో బ్లాక్ బస్టర్ అందుకుని ఏడాదిన్నర నిరీక్షణను సార్థకం చేసుకున్న నితిన్ కొత్త సినిమా చెక్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా స్క్రీన్ ప్లే మేజిక్ తో కట్టిపడేస్తారన్న పేరున్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు కావడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో దీని మీద ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. టాక్ తోనే నిలబడే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అందులోనూ నితిన్ లాంటి మార్కెట్ ఉన్న హీరో చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది. ప్రియా వారియర్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ గా మరో కీలక పాత్రలో నటించిన చెక్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

2014లో జరిగిన బాంబు పేలుళ్లను టెర్రరిస్టులతో కలిసి కుట్ర పన్నాడన్న అభియోగం ఋజువు కావడంతో వాళ్ళతో పాటు ఆదిత్య(నితిన్)కు ఉరిశిక్ష పడుతుంది. జైలుకు వెళ్ళాక ఆదిత్య తనలో చెస్ నైపుణ్యాన్ని బయట పెడతాడు. ఇతని తరఫున లాయర్ మానస(రకుల్ ప్రీత్ సింగ్) అప్పీల్ కు వెళ్తుంది. ఈ క్రమంలో ఆదిత్య తన గతాన్ని బయటపెడతాడు. యాత్ర(ప్రియా వారియర్)తో తన ప్రేమకథను చెబుతాడు. అసలు ఇతను ఇంత పెద్ద పద్మవ్యూహంలో ఎలా చిక్కుకున్నాడు, చెస్ గేమ్ ద్వారా తన చావు నుంచి తప్పించుకున్నాడా లేక నిర్దోషిగా బయట పడ్డాడా లాంటి ప్రశ్నలకు సమాధానమే అసలు స్టోరీ.

నటీనటులు

ఏ హీరో అయినా తనకో ఇమేజ్ వచ్చాక ప్రయోగాత్మక సబ్జెక్టులతో రిస్క్ చేసేందుకు తటపటాయిస్తాడు. అయినా తనలో నటుడిని బయటికి తీసుకురావాలంటే అప్పుడప్పుడు చేయక తప్పదు. లేదంటే ఒక మూసలో ఉండిపోయి ఛాలెంజింగ్ పాత్రలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ కోణంలో చూస్తే నితిన్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకోవాలి. ఇది ఏ స్థాయిలో విజయం సాధిస్తుంది కమర్షియల్ గా ఎంత వసూళ్లు వస్తాయనేది పక్కనపెడితే మంచి డెసిషన్ అని చెప్పుకోవడానికి చెక్ ఒక ఖచ్చితమైన సినిమాగా నిలుస్తుంది. జైల్లో అంత సేపు నడిచే సన్నివేశాల్లో తనలో యాక్టర్ కు మెరుగులు దిద్దుకున్నాడు

ప్రకాష్ వారియర్ ది చాలా చిన్న పాత్ర. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఒక పాట తప్ప తనతో పెద్ద పనేమీ లేకపోయింది. అందుకే నోటెడ్ హీరోయిన్స్ ని కాకుండా బడ్జెట్ పరంగా కలిసొచ్చేలా తనను ఎంచుకోవడం తెలివైన పని. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కి కొంత అధిక ప్రాధాన్యం దక్కింది. ఆదిత్య తరఫున కోర్టులో పోరాడే ఎపిసోడ్స్ లో బాగానే చేసుకొచ్చింది. హీరోకి ఎలాగైనా శిక్ష పడాలని తపించిపోయే పోలీస్ క్యారెక్టర్ లో సంపత్ రాజ్ ఒదిగిపోయాడు. సాయిచంద్ కు ఈ మధ్య ఉనికిని చాటుకునే గట్టి పాత్రలు పడుతున్నాయి. పోసాని, మురళి శర్మ, హర్ష వర్ధన్. సిమ్రాన్ చౌదరి, చైతన్య కృష్ణ ఇలా అందరూ క్వాలిటీ క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవడం సినిమాకు హెల్ప్ అయ్యింది.

డైరెక్టర్ అండ్ టీమ్

ఇలాంటి కథలతో సినిమాలు తీయొచ్చా అని సగటు తోటి దర్శకులు సైతం ఆలోచనలో పడేసేలా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి ఈసారి కూడా అలాంటి కథాంశాన్నే ఎంచుకున్నారు. గతంలో ఈయన తీసినవాటితో దీన్ని పోల్చలేం కానీ స్టోరీ టెల్లింగ్ లో తన ప్రత్యేకతను చాటుకోవడానికి చంద్రశేఖర్ పడిన తపన ఇందులో కూడా కనిపిస్తుంది. లైన్ పరంగా ఇంటరెస్టింగ్ గా అనిపించే చెక్ ని ఒకేరకమైన టెంపోలో చెప్పేందుకు ప్రయత్నించారు కానీ అది స్క్రీన్ పైకొచ్చేటప్పటికి కథనం రూపంలో పూర్తిగా తడబడింది. ఫలితంగా ఎగ్జైటింగ్ గా మనం ఆశించే చాలా సన్నివేశాలు, ఎపిసోడ్స్ అంత ఉత్సుకతను కలిగించకుండానే సాగిపోతుంటాయి.

చెస్ అనేది సామాన్యులకు క్రికెట్, కబడ్డీ లాగా బాగా తెలిసిన ఆట కాదు. దాని మీద ఆసక్తి ఉండి, ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించి ఉంటేనో తప్ప సగటు మనిషి దీన్ని ఆడటం తక్కువే. ఈ క్రీడలో సంక్లిష్టత తెలిసినవాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. అందుకే ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా సచిన్ కున్న పాపులారిటీ విశ్వనాథన్ ఆనంద్ లాంటి వాళ్లకు లేదు. ఇది తెలిసీ చంద్రశేఖర్ ఏలేటి చెస్ ని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకోవడం సాహసమే. దీనికున్న ప్రధాన బలం బలహీనత రెండూ అదే. నితిన్ ఆటలో భాగంగా బోర్డుపై వేసే ఎత్తులు, గెలిచే క్రమాన్ని సాధారణ జనం ఈ కారణంగానే ఆస్వాదించలేరు. అదే సినిమా ఫ్లోని బాగా దెబ్బ తీసింది.

సాధారణంగా చంద్రశేఖర్ ఏలేటి తన సబ్జెక్టుల మీద చాలా హోమ్ వర్క్ చేస్తారని పేరు. కానీ విచిత్రంగా ఇందులో ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం షాక్ కలిగిస్తుంది. తీవ్రవాదిగా ముద్రపడి నలభై మంది చావుకు కారణమైన వ్యక్తిని కేవలం అతనిలో చదరంగం టాలెంట్ ఉందన్న కారణంగా దేశమంతా క్షమించమని అడిగేలా చూపించడం కన్విన్సింగ్ గా లేదు. ఏలేటి ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఉండొచ్చు. కానీ దాన్ని నమ్మశక్యంగా చూపించాలి. పదే పదే ఆదిత్య ప్రపంచంలోనే గొప్ప చెస్ ఆటగాడు అని ఎలివేషన్లు ఇవ్వడం ఒకదశలో బాగా ఎక్కువైపోయి అతను ఎలా నిర్దోషి అనే ఆసక్తిని క్రమంగా చంపేస్తుంది.

జైలులో చూపించిన వాతావరణం అక్కడి వ్యక్తులు తదితరాలు అంతా సహజంగానే ఉన్నా అక్కడ జరిగే వాటిని హీరోకు చాలా అనుకూలంగా ఉండేలా రాసుకోవడం చంద్రశేఖర్ స్థాయి ఇంటెలిజెన్స్ అయితే ఖచ్చితంగా కాదు. అనుకోకుండా ఒక రోజులో లాంటి సినిమాల్లో ఏదైతే ఇంపాక్ట్ చూపించారో అందులో కనీసం పావు వంతు కూడా చెక్ కలిగించదు. పైపెచ్చు అసలిది జరిగే పనేనా అనిపించేలా కోర్టులో, జైలులో, చెస్ టోర్నమెంట్ లో జరిగే సన్నివేశాలు ఒకదశలో సిల్లీగా కూడా అనిపిస్తాయి. బిజిఎంతో ఎంత కవర్ చేసినా కూడా ఎక్కడికక్కడ లోటుపాట్లు బయట పడుతూనే ఉంటాయి.

కమర్షియల్ ఫార్ములాకు తాను దూరమనే చెప్పుకునే ఏలేటిలోని ఒరిజినల్ క్రియేటర్ చెక్ లో కనిపించలేదు. ఫ్లాష్ బ్యాక్ లో పాట ఇరికించడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి. ప్రియా వారియర్ నితిన్ ల మధ్య లవ్ ఎస్టాబ్లిష్ చేసే ఎపిసోడ్ ఎంత మొక్కుబడిగా ఉందో ఇక్కడ మాటల్లో చెప్పడం కష్టం. ఇలా చాలా చోట్ల కనెక్టివిటీని మిస్ చేసుకుంటూ వెళ్లిన చంద్రశేఖర్ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చారు కానీ కేవలం దాన్ని ఆధారంగా చేసుకుని పబ్లిక్ థ్రిల్ అయిపోవడం లాంటిదేమీ జరగదు. ఇంకా ఎన్నో బేసిక్ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పకుండానే శుభం కార్డు వేసేస్తారు. చెక్ ని ఎంత తక్కువగా అంచనా వేసుకుంటే అంత సేఫ్

ప్రమోషన్లో పలు చోట్ల ఇంటర్వ్యూలలో చెప్పినట్టు సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చెక్ కు ప్రాణంగా నిలిచారు. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో అయితే ఆ అనుభూతిని ఆస్వాదించవచ్చు. ఉన్న ఒక్క పాట మరీ గొప్పగా లేదు. అది వచ్చే సందర్బం కూడా మైనస్ అయ్యింది. రాహుల్ శ్రీవాత్సవ్ ఛాయాగ్రహణం ఉన్నతంగా ఉంది. సింగల్ లొకేషన్ లో అధిక భాగం సాగే ఇలాంటి సినిమాలు బోర్ కొట్టకుండా చేయడంలో కెమెరా మెన్ పాత్ర చాలా కీలకం. ఆ బాధ్యతను రాహుల్ సంపూర్ణంగా నెరవేర్చారు. సనల్ అనిరుధన్ ఎడిటింగ్ సగటు స్థాయిలోనే సాగింది. కొన్ని రిపీటెడ్ అనిపించే సీన్లకు కోత వేసి ఉంటే బాగుండేది. భవ్య అధినేత ఆనంద ప్రసాద్ బడ్జెట్ విషయంలో తెలివిగా వ్యవహరించారు. జైలుతో పాటు రెండు మూడు ఇంటీరియర్ సెట్స్ తో పని పూర్తి చేశారు

ప్లస్ గా అనిపించేవి

నితిన్ నటన
యునీక్ పాయింట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ గా తోచేవి

లాజిక్స్ ని పూర్తిగా వదిలేయడం
ప్రియా వారియర్ ఎపిసోడ్
హీరో పాత్ర ఎలివేషన్లు
ఫస్ట్ హాఫ్
సాగతీత

కంక్లూజన్

చెక్ లాంటి సినిమాలను రెగ్యులర్ క్యాటగిరిలో వేసి చూడలేం. నిజమే. అలా అని ఇంటలిజెన్స్ పేరుతో బేసిక్స్ ని మర్చిపోయి, లాజిక్స్ ని వదిలేసి చిన్న ట్విస్ట్ ని పట్టుకుని ఊహాతీతంగా కథలు చెబితే మాత్రం ఏ ప్రేక్షకుడైనా ప్రశ్నిస్తాడు. చెక్ లో జరిగింది అదే. ఎమోషన్లు, షాక్ ఇచ్చే సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు ఏమీ లేకుండా చెప్పిందే ట్విస్టు, చూపించిందే థ్రిల్ అనుకోమంటూ ఈ సినిమా రూపంలో చంద్రశేఖర్ ఏలేటి చేసిన ప్రయత్నం ఆయన స్థాయిది మాత్రం కాదు. మరీ భరించలేనిదని చెప్పలేం కానీ పెట్టుకున్న అంచనాలను సగం కూడా అందుకోలేదని మాత్రం సంపూర్ణంగా చెప్పొచ్చు.

చెక్ – పారని చదరంగం ఎత్తులు

Show comments