ఏప్రిల్ 28 ఏం జరిగింది రివ్యూ

మొన్న నితిన్ చెక్ తో పాటు మరో ఏడు చిన్న సినిమాల పోటీ ఉండటంతో ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది ఏప్రిల్ 28 ఏం జరిగింది. హీరో రంజిత్ తో పాటు అధిక శాతం కొత్త వారు నటించిన ఈ చిత్రం మీద అంచనాలేమి లేవు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిఖిల్, బిగ్ బాస్ సొహైల్ ప్రత్యేకంగా చెప్పడంతో అంతో ఇంతో ఆసక్తి రేగిన మాట వాస్తవం. ట్రైలర్ వచ్చాక ఇదో డిఫరెంట్ క్రైమ్ కం హారర్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ రావడం కూడా కొంత హైప్ రావడానికి తోడ్పడింది. మరి ఆ కాసింత బజ్ ని నిలబెట్టుకుని పికప్ అయ్యేంత మ్యాటర్ ఈ ఏప్రిల్ 28 ఏం జరిగిందిలో ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

సినిమాలకు రచయితగా పని చేసే విహారి(రంజిత్)ఓ ఫ్లాపు తర్వాత నిర్మాత(తనికెళ్ళ భరణి)ఒత్తిడితో మంచి ఐడియా కోసం భార్య ప్రవల్లిక(షెర్రీ అగర్వాల్)తో కలిసి సిరిపురం అనే ఊరికి వెళ్తాడు. అక్కడ గెస్ట్ హౌస్ లో స్టే చేస్తాడు. కానీ అందులో ఉన్న కొన్ని ఆత్మలు రంజిత్ తో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ తర్వాత అక్కడ కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతాయి. విహారికి స్నేహితుడిగా మారిన ఎస్ఐ డేవిడ్(అజయ్)తో పాటు ఈ ఫ్యామిలీ మొత్తం విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఆ ఇంటి వెనుక విషాదం తెలుస్తుంది. అసలు ఈ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే తెరమీదే చూడాలి

నటీనటులు

హీరోతో పాటు నిర్మాత కూడా అయిన రంజిత్ నటన పరంగా ఇంకా బేసిక్ స్టేజి లోనే ఉన్నాడు. చాలా చోట్ల ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడంలో ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిచోట్ల మొక్కుబడిగా కూడా కనిపిస్తాడు. దానికి తోడు ఇమేజ్ ఉన్న స్టార్ హీరో తరహాలో సినిమా మొదలైన పది నిమిషాలకే డాన్సులతో కూడిన పాట పెట్టడం ఎవరి ఆలోచనో కానీ అది కూడా మిస్ ఫైర్ అయ్యింది.గెడ్డం ప్లస్ డబ్బింగ్ తో ఇతని మైనస్సులను టీమ్ బాగానే కవర్ చేసింది. గట్టి శిక్షణ తీసుకుని ఉండాల్సింది.

హీరోయిన్ షెర్రీ అగర్వాల్ పర్వాలేదు. లుక్స్ ప్లస్ యాక్టింగ్ పరంగా ఓకే అనిపించుకుంది. ఈ మాత్రం అందంగా ఉండే అమ్మాయి రంజిత్ కు దొరకడం లక్ అనే చెప్పాలి. భరణి, అజయ్ లవి రెగ్యులర్ క్యారెక్టర్లే. తమ సీనియారిటీతో అలా చేసుకుంటూ పోయారు. కథలో కీలక పాత్రధారైన రాజీవ్ కనకాల చాలా రోజుల తర్వాత డిఫరెంట్ షేడ్స్ తో మెప్పించారు. తోటపల్లి మధు రెండు సీన్లకే పరిమితం. చమ్మక్ చంద్ర కామెడీ పేలలేదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే నటీనటులు గుర్తు కూడా ఉండరు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు వీరాస్వామి తన మొదటి సినిమా కాబట్టి పాయింట్ చాలా యునీక్ గా ఉండాలని ఇల్లు మాట్లాడటం అనే థీమ్ ని తీసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ రెండు గంటల పాటు ప్రేక్షకులను తదేకంగా కూర్చోబెట్టేంత కంప్లీట్ మెటీరియల్ ని సరిగా రాసుకోలేకపోయారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, ఇంటర్వెల్ బ్యాంగ్ ని మినహాయిస్తే మిగిలినంతా రొటీన్ వ్యవహారమే. ఓ బంగాళా, అందులో ఆత్మలు, మనం ఈజీగా ఊహించగలిగే వాటి ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ ఏప్రిల్ 28 ఏం జరిగిందికి ప్రతిబంధకంగా మారాయి. పోనీ విపరీతంగా భయపెట్టే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే అవీ కనిపించవు.

తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే హారర్ జానర్ బోర్ కొట్టేసింది. హాలీవుడ్ తరహాలో ఇక్కడి ఆడియన్స్ పదే పదే వాటిని చూడాలనుకోరు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడిది వర్క్ అవుట్ అయ్యే ఫార్ములా కాదు. అలాంటిది వీరాస్వామి తనకొచ్చిన చిన్న ఆలోచనను ఇంత నిడివితో చెప్పాలనుకోవడం సాహసమే. అందులోనూ కథను చెప్పే క్రమంలో చాలా చోట్ల చిన్న చిన్న లాజిక్స్ ని సైతం మిస్ చేయడం ఎన్నో ప్రశ్నలను మిగులుస్తుంది. పోలీసు నిఘా వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిన తరుణంలో కొన్నేళ్ల ఓ పెద్ద ఇంట్లో ధనవంతులైన అయిదురు కుటుంబ సభ్యులు ఉండేవారన్న సమాచారాన్ని కూడా కనుక్కోలేకపోవడం అంతుచిక్కని ప్రశ్నే.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ కేవలం రెండు మూడు లొకేషన్లతోనే వీరాస్వామి ఈ మాత్రం అవుట్ ఫుట్ తేవడం మెచ్చుకోదగిన విషయం. బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని టీమ్ సహాయంతో క్వాలిటీని తెరమీద చూపించేందుకు పడిన కష్టం కనిపిస్తుంది. కానీ సినిమా చూసేందుకు ఈ ఒక్క కారణం సరిపోలేదు. ఇంకేదో చేసుండాల్సిందని పదే పదే అనిపిస్తుంది. బడ్జెట్ పరంగా పరిమితులు ఉన్నప్పటికీ సబ్జెక్టు పరంగా ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుండేది. టైటిల్ ద్వారా ఏప్రిల్ 28 ఏం జరిగిందనే పెద్ద సస్పెన్స్ ని సృష్టించి తీరా సినిమా చూశాక ఇంతేనా జరిగింది అనిపించడం లోటే

సందీప్ కుమార్ ఛాయాగ్రహణం బాగుంది. మరీ ఎక్కువ విసుగు రాకుండా తక్కువ లొకేషన్లను అందులోనూ ఇంటీరియర్ ఎక్కువగా నడిచే సన్నివేశాలను తన పనితనం ద్వారా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అవసరం లేని రెండు పాటలు ఇంప్రెషన్ ని తగ్గించాయి. సునీల్ కుమార్ ఛాయాగ్రహణం కూడా స్టాండర్డ్ లోనే సాగింది. హరి ప్రసాద్ జక్కా స్క్రీన్ ప్లే కొంత భాగం మినహాయించి రొటీన్ గా సాగింది. నిర్మాణ విలువల గురించి చెప్పేందుకు ఏమి లేదు. బడ్జెట్ డిమాండ్ చేసే కథ కాదు కాబట్టే ఒప్పుకున్నారు కనక పెద్దగా బరువు లేకుండానే ఖర్చుతో మేనేజ్ చేశారు.

ప్లస్ గా అనిపించేవి

ఇంటర్వెల్ ట్విస్ట్
కెమెరా వర్క్
బిజిఎం

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
ఫ్లాష్ బ్యాక్
పాటలు
హీరో యాక్టింగ్

కంక్లూజన్

ఏప్రిల్ 28 ఏం జరిగింది అనే ప్రశ్నను వేసుకుని థియేటర్ లో అడుగు పెట్టిన ప్రేక్షకులకు బయటికి వచ్చాక ఇంతేనా జరిగింది అని ప్రేక్షకుడు సమాధానం చెప్పుకునేలా డెబ్యూ దర్శకుడు వీరాస్వామి చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కేవలం రెండు ట్విస్టులతో సంతృప్తిపడి మిగిలినదంతా ఎలా ఉన్నా జనం భరించే రోజులు కావివి. అందులోనూ ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిన హారర్ జోనర్ ని టచ్ చేస్తున్నప్పుడు చాలా హోమ్ వర్క్ చేయాలి. అందులోనూ కొత్త ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు ఇది ఎక్కువ మోతాదులో ఉండాలి. అవేవి లేని ఏప్రిల్ 28 ఏం జరిగింది ఒక సగటు థ్రిల్లర్ గానే మిగిలిపోయింది

ఏప్రిల్ 28 ఏం జరిగింది – ఏమీ జరగలేదు

Show comments