Anubhavinchu Raja Review : అనుభవించు రాజా రివ్యూ

గత కొన్నేళ్లుగా హిట్టు లేక చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న యూత్ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా అనుభవించు రాజా ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. గతంలో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ద్వారా తనతో ఆల్రెడీ వర్క్ చేసిన దర్శకుడు శ్రీను గవిరెడ్డితో మరోసారి పని చేసేందుకు ఒకే చెప్పిన రాజ్ తరుణ్ కు ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అండగా నిలిచింది. గతంలో ఈ సంస్థ రంగులరాట్నంతో ఓ ప్రాజెక్టు చేసింది అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సంక్రాంతి బ్యాక్ డ్రాప్, కోడి పందేలు సెటప్ తో పండగకు రెండు నెలల ముందే వచ్చిన ఈ ఎంటర్ టైనర్ మెప్పించేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ ఉంటాడు రాజ్(రాజ్ తరుణ్). ఇతన్ని చూసి కొలీగ్ అనుకుని పొరపాటు పడిన శృతి (కషిష్ ఖాన్)పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. నిజం తెలుసుకున్నాక దూరం పెడుతుంది. అదే సమయంలో రాజ్ మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఊహించని విధంగా పెద్ద ప్రమాదం వచ్చి పడుతుంది. ఈ క్రమంలోనే రాజ్ పేరు బంగారమని, భీమవరం దగ్గర ఓ పల్లెటూరిలో పెద్ద డబ్బున్న కుటుంబానికి చెందిన వాడని తెలుస్తుంది. అసలు అంత ఆస్తి ఉన్న బంగారం సిటీకి ఎందుకు వచ్చాడు, మర్డర్ చేయడానికి వచ్చిన గ్యాంగ్ కి అతనికి కనెక్షన్ ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా

నటీనటులు

రాజ్ తరుణ్ లో మంచి ఎనర్జీ ఉంది. అందులో సందేహం లేదు. యూత్ కి త్వరగా పట్టేసే ఒక డిఫరెంట్ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ తన సొంతం. గొప్ప నటుడు లాంటి కితాబులకు ఆమడ దూరంలో ఉంటాడు కానీ యాకింగ్ మెటీరియల్ లేదని మాత్రం అనలేం. కానీ దీన్ని సరైన రీతిలో వాడుకునే కంటెంట్ పడాలి. తనవరకు ఇందులో క్యారెక్టర్ ఏదైతే డిమాండ్ చేసిందో అది కరెక్ట్ గానే ఇచ్చాడు. సెక్యూరిటీ గార్డ్ గా, ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసే పందేల రాయుడిగా మంచి షేడ్సే ఇచ్చాడు. కానీ ప్రెజెంట్ చేసిన విధానం రొటీన్ గానే ఉండటంతో రాజ్ తరుణ్ సైతం అలాగే కనిపిస్తాడు. పట్టిందల్లా ప్లాస్టిక్ అవుతుంటే అతను మాత్రం ఏం చేయగలడు

హీరోయిన్ కషిష్ ఖాన్ పీలగా ఉన్నా పర్వాలేదనిపించింది. డబ్బింగ్ తో చక్కగా మేనేజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో తనతో సమానంగా కనిపించే ఫ్రెండ్ కు ఎక్కువ స్పేస్ దొరకడం విశేషం. సెకండ్ హాఫ్ లో ఇద్దరూ మళ్ళీ కనిపిస్తే ఒట్టు. అజయ్, పోసాని కృష్ణమురళి, ఆడుకాలం నరేన్, రవి కృష్ణ, సుదర్శన్ తదితరులవి రొటీన్ కన్నా పెద్ద పదం వాడాల్సిన క్యారెక్టర్లు. బిగ్ బాస్ అరియనా ఎందుకు ఉందో అర్థం కాదు. విలన్లు ఆదర్శ్ బాలకృష్ణ, టెంపర్ వంశీ ఉన్నంతలో భయపెట్టే విలనీ చూపించే ప్రయత్నం చేశారు. జస్ట్ ఓకే. ఇతరత్రా చిన్నా చితకా ఆర్టిస్టులు అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవాళ్లే.

డైరెక్టర్ అండ్ టీమ్

నాలుగు జోకులు, మూడు పాటలతో నూటా యాభై రూపాయల ప్రేక్షకుల టికెట్ కు న్యాయం చేసే రోజులు కావివి. ఈ మాత్రం ఎంటర్ టైన్మెంట్ యుట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతోంది. స్మార్ట్ ఫోన్లో జియో సిం ఉంటే చాలు ఎక్కడబడితే అక్కడ ఎప్పుడు బడితే అప్పుడు ఎంచక్కా చూసుకోవచ్చు. లేదూ పగలబడి నవ్వే బూతు కామెడీ కావాలన్నా టీవీ ఛానల్స్ నిక్షేపంగా వాటిని ఏళ్ళ తరబడి అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెండితెర మీద ఇచ్చే వినోదం ఆషామాషీగా ఉంటే లాభం లేదు. రెండున్నర గంటల సమయాన్ని థియేటర్ కు ఇస్తున్న ఆడియన్స్ ని మెప్పించాలంటే బలమైన కారణం చూపించాలి.

కానీ ఇప్పటి దర్శకులు ఈ సూత్రాన్ని మర్చిపోతున్నారు. ఈ ఉపోద్ఘాతమంతా దర్శకుడు శ్రీను గవిరెడ్డిని విమర్శించడానికి కాదు. ప్రస్తుత పోకడ ఎలా ఉందో చెప్పడానికి మాత్రమే. అనుభవించు రాజాలో అసలు సమస్య చెప్పాలనుకున్న పాయింట్ లోనే ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న ఒక సింపుల్ లైన్ మీద అన్ని రకాల అంశాలను మిక్స్ చేయాలని చూసిన శ్రీను వీటిని సమపాళ్ళలో కలపలేక ఖంగాళీ చేశారు. కాసేపు కార్పొరేట్ బ్యాక్ డ్రాప్ లో నడిపించే లవ్ స్టోరీ, కట్ చేస్తే కమర్షియల్ సినిమా రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ తర్వాత రంగస్థలం టైపులో ప్రెసిడెంట్ గిరి డ్రామా ఇలా ఇష్టమొచ్చిన దిశలో రాజా ప్రయాణం సాగింది.

ఇన్ని అంశాలు ఉండకూడదన్న రూలేమీ లేదు. కాకపోతే బ్యాలన్స్ చేయడం, ఎంగేజ్ అయ్యేలా చూడటం చాలా కీలకం. రాజ్ శృతిల ప్రేమకథ అనాసక్తిగా సాగుతుంది. పోనీ అదయ్యాక ఏదో షాక్టింగ్ ట్విస్టు ఇచ్చారు కదాని సీట్లో నుంచి లేచి కూర్చునేలోగా పల్లెటూరి రామాయణం మొదలై విసుగు పుట్టిస్తుంది. ఏ సినిమాలోనూ రెండు మూడు మలుపులు భారం మొత్తాన్ని మోయలేవు. దానికి బలమైన సబ్ ప్లాట్స్ కావాలి. అనుభవించు రాజాలో మిస్ అయినవి ఇవే. ఏదో కమర్షియల్ స్టార్ కోసం రాసుకున్న సబ్జెక్టు మాదిరి అవసరం లేని ఎలివేషన్లు, బిల్డప్ లు రాజ్ తరుణ్ కి చాలా ఇచ్చారు. కానీ అవన్నీ ఆశించిన హైప్ ఇవ్వలేకపోయాయి.

అలా అని ఇది బ్యాడ్ ఫిలిం అని కాదు. అక్కడక్కడా మంచి సన్నివేశాలు లేకపోలేదు. కొన్ని డైలాగులు ఆలోచింపజేస్తాయి. ఇవి కనీసం సగం సినిమా ఉన్నా కూడా స్థాయి పెరిగేది. ఒకరకంగా చెప్పాలంటే సమరసింహారెడ్డి, బాషా టైపు కథే ఇది. చేయని హత్యలకు హీరోలు స్వంత ఊరు వదిలి నగరానికి వచ్చి చిన్నా చితగా ఉద్యోగం చేయడమనే పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా చెప్పాలని శ్రీను గవిరెడ్డి చేసిన ప్రయత్నమిది. సెకండ్ హాఫ్ లో ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం ఎన్నో సినిమాలను గుర్తుకు తెస్తే, కథను మలుపు తిప్పే జాతర ఎపిసోడ్ రవితేజ భద్రను లాంటి వాటిని అలా కళ్ళముందుకు తీసుకొస్తుంది.

టైటిల్, ప్రమోషన్ల ద్వారా దీన్నో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ప్రొజెక్ట్ చేసిన అనుభవించు రాజా కనీసం సోగ్గాడే చిన్ని నాయనా టైపులో కంప్లీట్ విలేజ్ కామెడీగానో తీర్చిదిద్దినా బాగుండేది. అటుఇటు తిప్పి ఒక టికెట్ కు రెండు సినిమాల బరువుని తలమీద పెట్టారు. కాకపోతే రాజ్ తరుణ్ గత కొన్నేళ్లలో చేసిన కళాఖండాల కంటే కొంత నయం అనిపించడం తప్ప ఇంకే ప్రత్యేకత లేకపోయింది. క్యాస్టింగ్ కూడా కొంత మిస్ ఫైర్ అయ్యింది. అసలు విలన్ పాత్రధారి ఎంపిక సరిగ్గా కుదరలేదు. అనుమానం రాకూడదని చేశారు కానీ సగటు ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేసే లాగే సాగింది. మొత్తానికి టీమ్ చెప్పినంతగా దీన్ని అనుభవించలేం

గోపి సుందర్ పాటలు చూస్తున్నప్పుడే ఓకే యావరేజ్ అనిపిస్తాయి కానీ ఆడియో పరంగా ఎలాంటి మేజిక్ లేదు. టైటిల్ సాంగ్ ఒకటే క్యాచీగా ఉంది. నేపధ్య సంగీతం కూడా సోసోనే. నరేష్ బనెల్ ఛాయాగ్రహణం నీట్ గా ఉంది. రెండు బ్యాక్ డ్రాప్ లు కాబట్టి బాలన్స్ చేశారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ నిడివిని రెండుగంటల పావు లోపే కుదించింది కానీ కథనంలో లోపం వల్ల ల్యాగ్ తప్పలేదు. రియల్ సతీష్ ఫైట్లు పర్వాలేదు. రచయితగా శ్రీను గవిరెడ్డి అక్కడక్కడా మంచి సంభాషణలతో మెప్పించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. హీరో మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మరీ గ్రాండ్ గా కాకుండా డీసెంట్ గా కానిచ్చేశారు

ప్లస్ గా అనిపించేవి

రాజ్ తరుణ్
ఒక పాట
అక్కడక్కడా కామెడీ

మైనస్ గా తోచేవి

అసలు ట్విస్టులు
విలేజ్ డ్రామా
హీరోయిన్
పండని లవ్ ట్రాక్

కంక్లూజన్

సంక్రాంతి పండగ, కోడి పందేలు ఇలా ఏవేవో ఊహించేసుకుని గొప్ప సినిమాను అనుభవించబోతున్నామని థియేటర్లో అడుగుపెడితే ఈ రాజా ఇచ్చేది మాములు క్వాలిటీ వినోదమే. ఆ రకంగా సంతృప్తి పడతాం అంటే నిస్సందేహంగా దీన్ని ఛాయస్ గా పెట్టుకోవచ్చు. లేదు హాల్ దాకా వెళ్ళడానికి మంచి కంటెంట్, బలమైన కారణం కావాలంటే మాత్రం ఆలోచించుకోక తప్పదు. రాజ్ తరుణ్ ఎనర్జీ, విలేజ్ బ్యాక్ డ్రాప్ లాంటి ఒకటిరెండు సానుకూల అంశాలు ఉన్నప్పటికీ రాత తీత వీక్ గా ఉండటంతో ఫైనల్ గా చెప్పాలంటే ఇదేంటి రాజా అనిపిస్తాడు. మార్కెట్ లో పెద్దగా ఆప్షన్లు లేవు కాబట్టి ఈ అవకాశాన్ని రాజా ఎంతమేరకు వాడుకుంటాడో చూడాలి

ఒక్కమాటలో – అనుభవించలేం రాజా

Also Read :Drushyam 2 Review : దృశ్యం 2 రివ్యూ

Show comments