YCP MPs Meet CEC – టీడీపీ మొదలుపెట్టింది.. వైసీపీ ముగించింది..

తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టిన బూతుల రాజకీయానికి వైసీపీ ముగింపు పలికింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దూషించడం ఆరు నెలల కిందట మొదలు పెట్టిన టీడీపీ,గత వారం దాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా దూషించడంతో ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ సోమవారం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రధాని, హోం మంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేయాలని భావించిన ఆయన రెండు రోజులు అక్కడ ఉన్నా,అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో తిరుగుముఖం పట్టారు.

సీఎంను దూషించి, రాష్ట్రంలో వారం రోజుల పాటు రాజకీయ అశాంతికి కారణమై కూడా చంద్రబాబు తిరిగి తమపైనే ఫిర్యాదు చేయడంపై వైసీపీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో అసలు బాబు బండారాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు వైసీపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) కలిసింది. ఒక పార్టీగా టీడీపీ ఎలా విఫలమైందన్న విషయం వైసీపీ నేతలు సీఈసీకి వివరించారు. అసభ్యపదజాలంతో ఒక ప్లాన్‌ ప్రకారం టీడీపీ నేతలు సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డిని ఏ విధంగా దూషించింది కమిషన్‌కు తెలిపారు. నారా లోకేష్, దేవినేని ఉమా మహేశ్వరరావు, బొండా ఉమా మహేశ్వరరావు, చింతకాయల అయ్యన్నపాతుడ్రు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తదితరులు రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని దూషించడాన్ని వైసీపీ ఎంపీల బృందం సీఈసీ దృష్టికి తీసుకెళ్లింది. అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరింది.

మరో వైపు వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌  కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలసి టీడీపీ బూతు రాజకీయంపై ఫిర్యాదు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ను టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు ఏ విధంగా దూషించింది అమిత్‌కు వివరించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న నేతలను దూషించే వారిపై చర్యలు తీసుకోవాలని గోరంట్ల మాధవ్‌ హోంమంత్రి అమిత్‌షాకు వినతిపత్రం ఇచ్చారు. దీంతో టీడీపీ మొదలుపెట్టిన బూతుల రాజకీయానికి వైసీపీ ముగింపు పలికినట్లైంది. అయితే తాజా ఎపిసోడ్‌ అనంతరం రాబోయే రోజుల్లో ప్రతిపక్ష టీడీపీ ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేస్తుందా? లేదా మునుపటి మాదిరిగానే అసభ్యపదజాలంతో దూషణల రాజకీయాన్ని కొనసాగిస్తుందా? చూడాలి.

Also Read : Chandrababu Delhi Tour-చంద్ర‌బాబుకు ఇప్ప‌టికైనా అర్థ‌మైన‌ట్లేనా?

Show comments