మంత్రులుగా ఎవరికి అవకాశం వస్తుంది?

మూడు నెలల వాయిదా తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు అందరూ ఊహించినవే. ఏపీకి చెందిన ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఇప్పుడు పార్లమెంట్ పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. దాంతో బీసీ సామాజికవర్గానికి చెందిన రెండు బెర్తులు ఖాళీ కాబోతున్న తరుణంలో క్యాబినెట్ కూర్పు మీద చర్చ సాగుతోంది. ఈసారి మంత్రివర్గం పునర్వవస్థీకరణ చేస్తారా లేక ఖాళీల భర్తీతో సరిపెడతారా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. సీఎం మనసులో ఏముందోననే ఆసక్తి సర్వత్రా వినిపిస్తోంది.

గతంలో బీసీలంతా తమకే ఉన్నారని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ఆయా వర్గాలు ఝలక్ ఇచ్చాయి. చంద్రబాబు హయంలో బీసీ వర్గాల పట్ల చిన్నచూపు చూడడంతో వారంతా సైకిల్ కి దూరమయ్యారు. ఆ వర్గాల్లో జగన్ కి ఆదరణ పెరిగిన మూలంగానే ఊహించని ఫలితాలు దక్కాయి. దానికి తగ్గట్టుగా జగన్ కూడా ఎన్నికల అనంతరం బీసీలకు పెద్ద పీట వేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా 50శాతం సీట్లు బీసీలకే కేటాయించడం ద్వారా రాజకీయ పదవుల్లో కూడా తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో బీసీలకు రాజ్యసభ స్థానం గగనంగా కనిపించేది. కానీ జగన్ మొదటి సారి ఎన్నికల్లోనే సగం సీట్లు వారికి కేటాయించడం కీలకాంశంగా భావించాలి.

ఈ నేపథ్యంలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు క్యాబినెట్ నుంచి వైదొలగాల్సి వస్తున్న తరుణంలో వారి స్థానంలో మళ్లీ బీసీలకే అవకాశం ఉంటుందనే వాదన బలంగా ఉంది. కీలకమైన శెట్టిబలిజ, మత్స్యసామాజిక వర్గాల కీలక నేతలు ఇప్పుడు రాజ్యసభ ఎంపీలయ్యారు. గోదావరి జిల్లాల ఫలితాలను ప్రభావితం చేసే శెట్టిబలిజ, రాష్ట్రవ్యాప్తంగా 18 నుంచి 20 స్థానాల్లో కీలకంగా ఉన్న మత్స్యకార సామాజికవర్గాల వారికి మళ్లీ చోటు కల్పించేందుకు జగన్ సుముఖత చూపవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం మత్స్యకార సామాజికవర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. వారిలో పలాస ఎమ్మెల్యే సీదర అప్పలరాజు. తొలిసారిగా సభలో అడుగుపెట్టగా, రెండోసారి గెలిచిన తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఉన్నారు. సతీష్ కి మంత్రి పదవి కోసం ఇటీవల పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు నేరుగా జగన్ తో మంత్రాంగం నడిపారు. ఇరువురి మధ్య ఈ నెల మొదటి వారంలో ఏకాంత సమావేశం కూడా జరిగింది. దాంతో మత్స్యకార బెర్త్ ఖాయం అయితే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఉంటుందనే ఆసక్తికరమే.

ఇక శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి చెల్లుబోయిన వేణు రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన కోసం ఆశావాహకంగా కనిపిస్తున్నప్పటికీ అలాంటి పరిస్థితి ఉండదనే వాదన ఉంది. గౌడ వర్గానికి చెందిన జోగి రమేష్‌ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికే కృష్ణా జిల్లాలో ముగ్గురు మంత్రులుండడం ఆయన ప్రధాన అడ్డంకి. ఇక మోపిదేవి స్థానంలో ప్రాంతీయ సమీకరణాల రీత్యా గుంటూరు జిల్లాకు అవకాశం ఇవ్వాల్సి వస్తే అంబటి రాంబాబు పేరు బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ఇప్పటికే కాపు మంత్రులు నలుగురు ఉండగా ఆయన ఐదో నేత అవుతారు. బోత్సా, కన్నబాబు , ఆళ్లనాని, పేర్ని నానితో పాటుగా అంబటికి కూడా అవకాశం ఉండవచ్చనే వాదన ఉంది. ఆయన కూడా బలంగా విశ్వసిస్తున్నారు.

మంత్రివర్గంలో ఇప్పటికే సీనియర్ల కొరత ఉన్న తరుణంలో అంబటి వంటి వారు అవసరం అని కొందరు వాదిస్తున్నారు. అయితే జగన్ తుది నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. పార్టీలో మొదటి నుంచీ లాబీయింగ్, ఇతర ఒత్తిళ్లకు అవకాశం లేకుండా నేరుగా సీఎం సొంత నిర్ణయమే అమలులోకి వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ఈసారి ఎలాంటి సంచలన నిర్ణయాలు ఉంటాయోననే చర్చ కూడా సాగుతోంది. మంత్రివర్గం కూర్పులో మొదట జగన్ అనేకమందిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు కూడా అలాంటి సంచలన నిర్ణయలు తీసుకున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ ఇద్దరి తర్వాత ఎవరన్నది అంతటా ఉత్కంఠ రేపుతున్న విషయం.

Show comments