Sujana Chowdary – ఆ ఎంపీ అజ్ఞాతవాసం ఎందుకు చేస్తున్నారు..?

వ్యాపార వేత్తలుగా ఉంటూ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే నేతలు ఎప్పుడు..? ఎలా..? వ్యవహరిస్తారో ఎవరికీ అంతుచిక్కదు. అప్పటి వరకు క్రియాశీలకంగా ఉండే సదరు నేతలు.. ఒక్కసారిగా సైలెంట్‌ అవుతారు. నెలల తరబడి కనిపించరు. మీడియాకు ముఖం చూపించరు. అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. మళ్లీ ప్రజలకు ముఖం ఎప్పుడు చూపిస్తారో కూడా తెలియదు. ఈ తరహాలో ఇప్పుడు పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యవహరిస్తున్నారు. ఆయన దాదాపు నాలుగు నెలలుగా కనిపించడం లేదు. చివరిగా ఈ ఏడాది జూన్‌లో తనపై సీబీఐ జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసిన సమయంలో.. మీడియాలో కనిపించారు.

తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన సుజనా చౌదరి ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించేవారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. బాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా కూడా ఒకరు. ఈ క్రమంలోనే సుజనాను చంద్రబాబు రాజ్యసభకు నామినేట్‌ చేశారు. వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత సుజనా చౌదరి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ నేతగా చెలామణి అవుతున్నారు.

Also Read : TDP BJP Allience -టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీజేపీ వైఖరి, బాబుకు మింగుడుపడని వ్యవహారం

వ్యాపారవేత్త అయిన సుజనా చౌదరిపై సీబీఐ కేసులు ఉన్నాయి. వ్యాపార కార్యకలాపాల కోసం బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని.. వాటిని విదేశాల్లోని తన షెల్‌ కంపెనీలకు తరలించారనే అభియోగాలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. దాదాపు 6 వేల కోట్ల రూపాయల మేరకు సుజనా చౌదరి బ్యాంకులకు టోపీ పెట్టారని సీబీఐ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచిపోతారనే అనుమానంతో సీబీఐ 2019లో లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసింది.

టీడీపీ అధికారం కోల్పోవడం, పైగా కేంద్రంలోని బీజేపీతో వైరం పెట్టుకోవడడం వంటి పరిణామాల నేపథ్యంలో.. సుజనా చౌదరి సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరారనే విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పటి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌కు మధ్య కోర్టు వివాదాలు నెలకొన్నప్పుడు.. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సుజనా చౌదరితో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ భేటీ కావడం సంచలనానికి దారితీసింది. ఆ భేటీలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ద్వారా వీరందరూ కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి.

ఆ తర్వాత జూన్‌లో సీబీఐ తనపై జారీ చేసిన లుక్‌అవుట్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ.. అమెరికా వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో సుజనా పిటిషన్‌ వేశారు. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించడం లేదు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఆయన రాజకీయంగా అజ్ఞాతవాసం గడుపుతున్నారా..? లేదా మరేదైనా కారణం ఉందా..? తెలియాల్సి ఉంది.

Also Read : Chandrababu Naidu – Diwali : బాబు ‘హిందూ’ ప్రేమ.. బీజేపీని ఆకర్షించడానికా?

Show comments