మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలపై జగన్ ఆలోచన ఏంటి?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ హయంలో చైర్మన్ గా ఎన్నికయిన ఎంఏ షరీఫ్‌, డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా పదవీకాలం ముగియడంతో మాజీలయ్యారు. మే నెలలోనే షరీఫ్ పదవీవిరమణ చేయగా ఆయన స్థానంలో ప్రోటెం స్పీకర్ గా ప్రస్తుతం పీడీఎఫ్ కి చెందిన విఠపు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ప్రోటెం స్పీకర్ గా ఉండడంతో త్వరగా అధికార పార్టీకి చెందిన నేతను చైర్మన్ హోదాలో కూర్చోబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. అయితే దానికి ముహూర్తం ఎప్పుడన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం.

Also Read: వరదాపురం సూరి మళ్లీ టీడీపీలోకి?పరిటాల కుటుంబం ఒప్పుకుంటుందా?

వాస్తవానికి సెప్టెంబర్ లో రెండోవారంలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని తొలుత నిర్ణయించారు. కానీ ఇప్పుడది 20 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఆ సందర్భంగా మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ముఖ్యంగా ప్రస్తుతం మండలిలో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలలో ఆయా స్థానాలకు ఎన్నికలు జరిగితే అన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలో చేరతాయి. దాంతో అధికార పార్టీకి మండలిలో సంపూర్ణ బలం వస్తుంది. ఇప్పటికే టీడీపీ మెజార్టీని కోల్పోయింది. పాలకపక్షం పై చేయి సాధించింది. కానీ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల విషయంలో పూర్తి మెజార్టీతో గెలిపించుకోవాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇటీవల కరోనా పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా మండలి ఎన్నికల నిర్వహణ కూడా వాయిదా పడింది. త్వరలో మళ్లీ లైన్ క్లియర్ చేసే అవకాశం కనిపిస్తోంది. దాంతో అక్టోబర్ నాటికి మండలి ఖాళీలన్నీ భర్తీ అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఎన్నికలు జరగాల్సిన 11 సీట్లలో పలువురు సీనియర్లకు ఛాన్స్ ఖాయంగా ఉంది. వారు కూడా మండలిలో అడుగుపెట్టిన తర్వాత చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులకు అర్హులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Also Read:బద్వేలు టీడీపీ అభ్యర్థి ఎంపికలో ఆతృత ఎందుకు?

దాంతో ఈసారి మండలి సమావేశాలు జరిగినప్పటికీ ప్రోటెం స్పీకర్ తోనే సరిపెట్టాలనే అభిప్రాయం అధికార పార్టీ నేతల్లో వినిపిస్తోంది. చివరి నిమిషంలో అధినేత నిర్ణయం మారితే తప్ప డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల వరకూ మండలి కొత్త చైర్మన్ రాకపోవచ్చని భావిస్తున్నారు. అప్పటి వరకూ ప్రోటెం స్పీకర్ వీబీఎస్ సారధ్యంలోనే కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Show comments