Idream media
Idream media
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. భారత షేర్ మార్కెట్ బిగ్ బుల్‌గా ఖ్యాతి పొందిన వ్యక్తి. వేలాది కోట్ల రూపాయలకు అధిపతి. ఆయన ఆలోచనలు, అడుగులు ఎప్పుడూ అటువైపే ఉంటాయి. అదే షేర్ మార్కెట్. వ్యాపార సామ్రాజ్య విస్తరణ. నిరంతరం మార్కెట్ స్ట్రాటజీలపైనే ఆయన దృష్టి ఉంటుంది. రాజకీయ వేదికలు, నాయకులతో అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లను కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో మోదీ భేటీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరో విశేషం ఏంటంటే.. వేల కోట్లకు అధిపతి అయిన ఝున్‌ఝున్‌వాలా నలిగిన చొక్కాతో చాలా సాదాసీదాగా కనిపించడంపై చర్చ జరుగుతోంది.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒకటే చర్చ.. ఇండియన్ బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్ ప్రధానిని ఎందుకు కలిశారు, వాలా నెక్ట్స్ స్టెప్ ఏంటీ అనేది ఆసక్తి గా మారింది. మార్కెట్ వ్యవహరాలు తప్పితే పెద్దగా ఇతర విషయాల్లో నేరుగా తల దూర్చని రాకేశ్ ఝున్‌ఝున్ వాలా తన శైలికి భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ వెంటనే బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. వరుసగా రెండు రోజుల పాటు హై ప్రొఫైల్ సమావేశాల్లో ఆయన పాల్గొనడం వెనుక ఆంతర్యం ఏంటనే కూపి లాగుతున్నాయి వ్యాపార వర్గాలు. మరోవైపు ఝున్‌ఝున్‌వాలాతో భేటీ విషయాలను ప్రధానిమోదీ, మంత్రి నిర్మలా సీతారామన్‌లు నేరుగా సోషల్ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్ చేశారు. కానీ భేటీలో ప్రస్తావించిన అంశాలను తెలపడం లేదు.
స్టాక్‌మార్కెట్‌లో దేశీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైం హై దగ్గర ట్రేడవుతున్నాయి. ఏషియా మార్కెట్లు నష్టాలు చవి చూస్తున్నా.. దేశీ మార్కెట్లు నిలకడగా ఉంటూ బుల్ జోరుని కొనసాగిస్తున్నాయి. మరోవైపు జీ షేర్ల విషయంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు రాకేశ్ చుట్టూ ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బుల్ ప్రధాని, ఆర్థిక మంత్రితో జరిపిన సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా త్వరలో ఆకాశ పేరుతో ఎయిర్‌లైన్స్ సేవలు ప్రారంభించే యోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సహకారం కోరేందుకు వచ్చి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక బిగ్‌బుల్ ఇచ్చే మార్కెట్ సూచనల కోసం దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. విదేశీ మార్కెట్ల కంటే స్వదేశీ మార్కెట్ల ద్వారానే ఎక్కువ లాభపడవచ్చంటూ ఆయన తరచుగా ఔత్సాహిక ఇన్వెస్టర్లకు సలహా ఇస్తుంటారు.
‘‘ఇంట్లో తిండి దొరుకుతుంటే బయట తినడం ఎందుకు.. భారత్‌ను నమ్మండి. పెట్టుబడులు పెట్టండి’’ అంటూ జూన్ నెలలో ఝున్‌ఝున్‌వాలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇన్వెస్టర్లకు ఝున్‌ఝున్‌వాలా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయన్ని అభినందించారు.
ఝున్‌ఝున్‌వాలతోపాటు మరికొందరు ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా ప్రధాని మోడీ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. వాలాను కలిసిన అనంతరం ప్రధాని పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వారితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంపాటు ఓ ఆసక్తికర కామెంట్‌ను ప్రధాని జోడించారు. ‘అంతర్దృష్టి ఉన్న వ్యక్తిని, అత్యంత చురుకైన వ్యక్తిని కలిశానంటూ’ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న బిగ్ బుల్‌ను కలవడం సంతోషంగా ఉందని చెప్పారు ప్రధాని మోడీ. రాకేష్‌తో పాటు ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా సైతం మోదీ ట్వీట్ చేసిన ఫొటోలో కనిపించారు. భారత షేర్ మార్కెట్ బిగ్ బుల్‌గా పిలుచుకునే ఝున్‌ఝున్‌వాలా నలిగిన చొక్కాతో చాలా సాదాసీదాగా కనిపించారు. ఇక ఝున్‌ఝున్‌వాలా కుర్చీలో కూర్చోగా.. తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ ఎదురుగా వినయంగా చేతులు కట్టుకుని ఉన్న మోదీ ఫొటో మరొకటి ట్విటర్‌లో షేర్ అయ్యాయి..