అభ్యర్థి మాట్లాడుతుంటే వెళ్లిపోతున్నారు..! హుజురాబాద్‌లో ఏం జరుగుతోంది..?

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు దసరా తర్వాత షెడ్యూల్‌ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంతో సంబంధం లేకుండా కొన్ని నెలలుగా టీఆర్‌ఎస్‌ నేతలు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దసరా తర్వాత పోరు షురూ కానుందని తెలియడంతో స్పీడు పెంచారు. రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

సమయం దగ్గరపడే కొద్దీ.. నేతల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నేతలకు తాజాగా జరిగిన ఓ సంఘటన చేదు అనుభవాన్ని, ఆందోళనను రేకెత్తించింది. జమ్మిగుంటలో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో.. ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడడం మొదలు పెట్టిన వెంటనే సభికులు కుర్చీలలో నుంచి లేచి వెళ్లిపోయారు. నేతలు కూర్చొవాలని చెబుతున్నా పట్టించుకోకుండా అవసరం లేదన్నట్లుగా చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. అంతకు ముందు మంత్రి హరీష్‌ రావు మాట్లాడిన తర్వాత గెల్లు శ్రీనివాస్‌ మైక్‌ అందుకున్నారు. కేసీఆర్‌ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదం చేస్తూ.. సభలో ఉన్న వారిని కూడా చేతులు పైకెత్తాలని కోరారు. అయితే సభలోని మహిళలు, పురుషులు.. తమ కుర్చీల్లో నుంచి లేచి వెళ్లిపోవడంతో వేదికపైన ఉన్న గులాబీ ఖంగుతిన్నారు.

ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తీసేసిన తర్వాత.. ఈటల కూడా టీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్‌ నాయకత్వాన్ని సవాల్‌ చేశారు. అందుకే కేసీఆర్‌ హుజురాబాద్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థి ఎంపికపై అనేక కసరత్తులు చేశారు. పలువురి పేర్లు పరిశీలించి.. ఆఖరుకు ఉద్యమ నేపథ్యం ఉన్న గెల్లు శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోసించిన ఈటలకు ధీటుగా గెల్లు శ్రీనివాస్‌ నిలుస్తారని భావించారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అంతగా అనుకూలించడంలేదని తాజాగా జరిగిన జమ్మిగుంట సభ ద్వారా అర్థమవుతోంది. ఈ పరిణామంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనూ ఆందోళన మొదలైంది.

Also Read : మహంత్‌ నరేంద్రగిరి ఆత్మహత్య.. అసలేం జరిగింది.. కారణాలు ఏంటంటే..?

ఈటల రాజేందర్‌పై సానుభూతి ఉంది. చేయని నేరాన్ని మోపి.. కావాలనే మంత్రి పదవి నుంచి తప్పించారనే భావన ప్రజల్లో నెలకొని ఉంది. ఈ విషయం టీఆర్‌ఎస్‌ నేతలకు కూడా అర్థమైంది. అందుకే హరీష్‌రావు సహా మంత్రులు ఈటలపై సానుభూతి చూపించనక్కర్లేదంటూ రకరకాల వాదనలను ప్రజలకు వినిపిస్తున్నారు. కేసీఆర్‌ ఆదరిస్తే.. ఆయనకే ఎసరు పెట్టాలని చూశారంటూ ఆరోపణలు గుప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ నేతలు. ఏం చేసినా.. ఈటలపై సానుభూతి మాత్రం తగ్గడంలేదని తెలుస్తోంది.

2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో హుజురాబాద్, దుబ్బాక, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు, అత్యంత ముఖ్యమైన హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. దుబ్బాకలో దెబ్బతగిలాక కేసీఆర్‌ నాగార్జున సాగర్‌కు వెళ్లారు తప్పితే.. మిగతా ఎన్నికలను ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ హుజురాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసీఆరే బరిలోకి దిగారు. గ్రామ స్థాయి నేతలతోనూ నేరుగా మాట్లాడుతున్నారు. దళిత బంధు పథకం కోసం ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. స్థానిక నేతలకు ఎమ్మెల్సీ పదవి, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ.. జరుగుతున్న పరిణామాలు కేసీఆర్‌తో సహా గులాబీ దళాన్ని కలవరపెట్టేవిగా ఉన్నాయి.

ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ అయినా.. ఈ ఎన్నికలు కేసీఆర్, ఈటల మధ్యే జరుగుతున్నట్లు అందరూ భావిస్తున్నారు. ఈ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

Also Read : తెలంగాణకు గట్టి షాక్, పాలమూరు-రంగారెడ్డి ఆపాలని NGT ఆదేశం

Show comments