మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారా అంటే.. అవుననే అంటున్నారు బందరు(మచిలీపట్నం) పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు. టీడీపీ తరఫున రెండు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసిన కొనకళ్ల.. గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత .. ప్రజాక్షేత్రంలో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. టీడీపీ ప్రొగ్రామ్స్ లోనూ అంత యాక్టివ్ గా లేరు. అయితే కొనకళ్ల రాజకీయాలకు స్వస్తి చెప్పారా..?లేదా పార్టీ పదవుల విషయంలో టీడీపీ అధినేతపై అలిగి ప్రస్తుతానికి సైలెంట్ మోడ్ లో ఉన్నారా.. ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అంత్యంత సంపన్న జిల్లాల్లో ఒకటైన కృష్ణా జిల్లా వాస్తవ్యుడైన కొనకళ్ల ..గీతకార్మిక కులానికి చెందినవారు. గౌతు లచ్చన్న అనుచరుడిగా చెప్పుకునే 70 ఏళ్ల ఈ రాజకీయ నేత తనను తాను బీసీ నాయకుడిగా చెప్పుకునేందుకే ఇష్టపడతారు. రెండు మార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నికైనప్పటికీ అత్యంత సాదాసీదా నేతగానే వ్యవహరించారు. సౌమ్యుడు, వివాదరహితుడైన కొనకళ్ల.. ఆంధ్రప్రదేశ్ విభజనను లోక్ సభలో గట్టిగా వ్యతిరేకించిన ఎంపీలలో ఈయన కూడా ఒకరు. లోక్ సభలో నిరసన వ్యక్తం చేసే తీవ్ర ఆందోళన చెంది, గుండెపోటకు గురయ్యారు. 16వ లోక్ సభలో 218 ప్రశ్నలడగడంతో పాటు నియోజకవర్గానికి అత్యధిక నిధులు రాబట్టారు. మచిలీపట్నం –విజయవాడ రహదారి అభివృద్ధితో పాటు కత్తిపుడి నుంచి ఒంగోలు జాతీయ రహదారి కోసం ఎంపీగా ఉన్న సమయంలో తీవ్రంగా కృషి చేశారు. ఎంపీగా ఉన్న సమయంలోనే కంకటావ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం భౌగోళికంగా, సామాజికంగా విభిన్నమైనది. డెల్టా, తీరం కలగలిసిన ప్రాంతం. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందులోనూ గౌడ, మత్స్యకార ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటు తర్వాత మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి, రెండోసారి అంటే రెండో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మండలి వెంకటకృష్ణారావు విజయం సాధించారు. ఓ మారు స్వతంత్ర అభ్యర్థి కూడా బందరు బరిలో విజయకేతనం ఎగురవేశారు. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు ఆ పార్టీ అభ్యర్థులు గెలవగా, 4పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 17 వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి బాలశౌరి నెగ్గారు.
Also Read : లోకేషా.. ఇంత కథ ఉందా..?
తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న కొనకళ్ల.. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు 2009, 2014 ఎన్నికల్లో సునాయసంగానే విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలో కొనకళ్ల నారాయణ రావు విజయం సాధించారు. తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య ఎన్నికల పొత్తు కుదరడంతో ఆ ఎన్నికల్లో కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథిపై కొనకళ్ల గెలుపొందారు.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో పామర్రు నియోజకర్గం ఎస్సీ రిజర్వడ్ కాగా మిగతా స్థానాలు జనరల్ కేటగిరిలో ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత గన్నవరం, గుడివాడ, పెడన, పామర్రు అసెంబ్లీ స్థానాల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆ పార్టీ హవానే నడిచింది. పార్టీకి ఆర్థికంగా బలమైన కమ్మసామాజిక వర్గ మద్దతుతో పాటు అభ్యర్థి సోషల్ స్టేటస్, రాజకీయ సమీకరణలు కూడా కొనకళ్ల వరుస విజయానికి
2014 ఎన్నికల్లో పెడన నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన కాగిత వెంకట్రావు ఎమ్మెల్యేగా సాధించారు. అయితే ఆయన మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఒకే సామాజిక వర్గమైనప్పటికీ కాగిత వెంకట్రావు, కొనకళ్ల నారాయణ రావు మధ్య కూడా ఆధిపత్య పోరు నడిచినట్లు వార్తలొచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నుంచి గీతకార్మిక సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్, వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
Also Read : బుచ్చయ్య ఎపిసోడ్‌లో కొత్త వివాదం.. ఎవరు లోకల్..? ఎవరు నాన్‌లోకల్..?
రాజకీయ ప్రస్థానంలో అవినీతి మరక లేనప్పటికీ, సొంతంగా నిర్ణయం తీసుకోలేరనే అపవాదు ఈయనపై ఉంది. ప్రతి విషయానికి తమ్ముడిపై ఆధారపడతారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతతో పాటు అధికారంలో ఉన్న సమయంలో కేడర్ ను పట్టించ్చుకోకపోవడంతోనే 2019 ఎన్నికల్లో ఓటమి చెందినట్లు స్థానికలు విశ్లేషిస్తున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచింది. పెనమలూరు నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, పామర్రు(ఎస్సీ రిజర్వడ్ ) నుంచి కైలే అనిల్ కుమార్, గుడివాడ నుంచి కొడాలి నాని, పెడన నుంచి జోగి రమేష్, మచిలీపట్నం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని, అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు వైసీపీ తరపున విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాలశౌరి చేతిలో ఓటమి చెందిన తర్వాత, ప్రత్యక్ష రాజకీయాలు, టీడీపీ పట్ల అనుసరిస్తున్న తీరు మాత్రం పలు ప్రశ్నలకు తావిస్తోంది. టీడీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నప్పటికీ టీడీపీ చేపట్టే ఆందోళనలో కనిపిస్తున్న ఘటనలు మాత్రం చాలా అరుదుగానే ఉన్నాయి. అప్పుడేప్పుడో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చినప్పుడు, చంద్రబాబు ఆదేశాలు మేరకు వెళ్లి వంశీని బుజ్జగించే ప్రయత్నం చేశారు. తర్వాత మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలు వివిధ కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు మీడియా ద్వారా వారి అరెస్టును ఖండించారు.
సీనియార్టీ ఉన్నా, బీసీ నాయకుడు కావడంతో తగినంత గుర్తింపు దక్కలేదనే అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా..? అనే ప్రశ్న కూడా తలెత్తుంది. అయితే ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్ పై ఆయన మాత్రమే క్లారిటీ ఇవ్వగలరు.
Also Read : వచ్చేసారి మండపేటలో వేగుళ్లకు చంద్రబాబు సీటిస్తారా..?