తప్పుడు నిర్ణయాలతో రాజకీయ భవిష్యత్తు కోల్పోయిన వంగవీటి రాధా

విజయవాడ రాజకీయాల్లో, ప్రత్యేకించి 1970-80 దశకాల్లో వంగవీటి కుటుంబానికో ప్రాముఖ్యత ఉంది. వర్గరాజకీయాలతో ఎదిగిన వంగవీటి కుటుంబానికి ఆంధ్ర ప్రదేశ్ లో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ప్రాధాన్యత ఉంది. ఇది కాదనలేని సత్యం. అయితే ఆ వంగవీటి కుటుంబానికి వారసుడుగా వచ్చిన వంగవీటి రాధాకృష్ణ వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తనకు తానే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు.

వంగవీటి రంగా కొడుకుగా 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధాకృష్ణ అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ద్వారా డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డిపై వత్తిడి తెచ్చి కాంగ్రెస్ టికెట్ సంపాదించుకుని అప్పట్లో విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. “ఇప్పుడే నీకు రాజకీయాలెందుకు. ఆ చదువేదో పూర్తిచేసుకుని రా… నీ భవిష్యత్తు నేను చూసుకుంటా” అని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చేసిన సూచనను కూడా తిరస్కరించి 2004లో పోటీచేసేందుకు పట్టుబట్టారు. చేసేది లేక డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాధాకృష్ణ గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. రాధాకృష్ణకు టికెట్ ఇవ్వొద్దని అతని సొంత తల్లి రత్నకుమారి మీడియాకు ఎక్కి హంగామా చేశారు.

అయితే డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని కాదని 2009లో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు రాధాకృష్ణ. “ఆ పార్టీలోకి వెళ్ళకు. కాంగ్రెస్ లో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మరోసారి నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావు” అంటూ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సలహా ఇచ్చినా రాధాకృష్ణ చెవినపెట్టలేదు. ఆ యేడాది జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. విజయవాడ తూర్పు నుంచి మాజీ ఎమ్మెల్యే యలమంచలి నాగేశ్వరరావు కొడుకు రవి,పశ్చిమ నియోజకవర్గం నుంచి రాజకీయాలకు కొత్త అయినా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరూ ప్రజారాజ్యం తరుపున గెలిచారు కానీ పక్కాగా గెలుస్తాడనుకున్న రాధా ఓడిపోయాడు.

ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మరణించడం, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. అలాగే, కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకుంటే చిరంజీవిని వదిలేసి రాధాకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ఇక్కడ కూడా రాధాకృష్ణ ఎక్కువకాలం నిలవలేకపోయారు. జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేసి ఆ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. అక్కడ నుండి 2014లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న జన సేన పార్టీలో చేరతారు అని అందరూ అనుకున్నా రాధాకృష్ణ మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా మౌనంగా ఉండిపోయారు. చివరికి ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లగా ఆ పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకుని చివరికి 2019 ఎన్నికలకు ముందు అధికారికంగా ఆ పార్టీలో చేరిపోయారు.

రాధాకృష్ణ తండ్రి వంగవీటి మోహన రంగారావు (రంగా) టీడీపీపై పోరాటం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళనలు చేశారు. చివరికి నిరాహార దీక్షలో ఉండగా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కుట్రదారుడుగా, అప్పటి హోం మంత్రి కోడెల శివప్రసాద రావు తదితరులపై ఆరోపణలు వచ్చాయి. హత్య నిందితులు ప్రధానంగా అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, రంగా ప్రత్యర్థిగా నిలిచిన దేవినేని నెహ్రూ అనుచరులే.

రంగా హత్య తర్వాత విజయవాడలో, ఇంకా కోస్తా జిల్లాల్లోని అనేక పట్టణాల్లో, గ్రామాల్లో టీడీపీ నేతలు ఇళ్ళపై రంగా అభిమానులు దాడులు చేశారు. వారి ఆస్తులు ధ్వంసం చేశారు. అటువంటి పార్టీలోకి రంగా కొడుకు చేరడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. చాలా మంది రాధాకృష్ణ తీసుకున్న మరో తప్పుడు నిర్ణయం ఇది అని వ్యాఖ్యానించారు. అప్పటినుండి రాధాకృష్ణ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందే పార్టీలో చేరినా ఆ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం టీడీపీ నాయకత్వం రాధాకృష్ణకు ఇవ్వలేదు. అందువల్ల 2019 ఎన్నికల్లో కూడా ఆయన పోటీచేయకుండానే ఉండాల్సి వచ్చింది.

ఇప్పుడు మరో రెండేళ్ళలో, 2024లో, ఎన్నికలు జరగనున్న ఈ తరుణంలో రాధాకృష్ణ మరో తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నట్టు సూచనలు అందుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై 2014లో లేని ప్రేమ, 2019లో కూడా లేని ప్రేమ ఆయనకు ఇప్పుడు పుట్టుకొస్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీలో ఉంటూ పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ప్రకటన చేసి మరోసారి వివాదాస్పదుడయ్యారు. “రంగాను కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు ఓ బలమైన నేతను కాపాడుకోవాలి” అంటూ కాపు సంఘాలకు రాధాకృష్ణ ఓ పిలుపు ఇచ్చారు. ఆయన దృష్టిలో ప్రస్తుతం ఉన్న బలమైన నేత పవన్ కళ్యాణ్. అంటే ఆయన పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చినట్టే అని, రేపో, మాపో రాధాకృష్ణ జనసేనలో చేరతారు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ పుకార్లు ఆధారంగా తీసుకుంటే, ఒక వేళ రాధాకృష్ణ 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరితే, ఆ ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా గెలిచే అవకాశం అయితే లేదు. జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరినా, రాధాకృష్ణ ఆ ఎన్నికల్లో పోటీ చేసినా ఆయన్ను ఓడించేందుకు వైసీపీ నేతలు గట్టి ప్రయత్నమే చేస్తారు అనడంలో సందేహం లేదు.టీడీపీ నేతలు కూడా రాధ గెలుపుకు సహకరించకపోవచ్చు. అలా చూసుకున్నా రాధాకృష్ణకు మరోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం మాత్రం ఉన్నట్టు లేదు. అంతిమంగా చెప్పేదేమంటే, వంగవీటి రాధాకృష్ణ ప్రతిసారీ తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాజకీయంగా తన భవిష్యత్తుకు తానే సమాధి కట్టుకుంటున్నారు. 2004లో రాజకీయ అరంగ్రేటం తర్వాత నుండి ఆయన తీసుకున్న ప్రతినిర్ణయం ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం కూడా ఇంతకు భిన్నంగా ఉండకపోవచ్చు.

మరో వైపు రంగా ప్రత్యర్థి నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. తండ్రితో పాటు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేసినా, కొన్ని కారణాలవల్ల 2019 ఎన్నికల ముందు తండ్రితో కలిసి టీడీపీలోకి వెళ్ళినా ఎన్నికల తర్వాత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత చేరువ అయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ కీలకంగా ఎదుగుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు మార్గాలను సుగమం చేసుకుంటున్నారు. కానీ రంగా కొడుకు రాధాకృష్ణ మాత్రం తనకున్న అన్ని మార్గాలను తానే ఒక్కొక్కటిగా మూసివేసుకుంటూ తన భవిష్యత్తుకు తానే సమాధి కట్టుకుంటున్నారు.

అందుకే 1990 దశకంలో పర్వతనేని ఉపేంద్ర చెప్పేవారు – రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అని. రాధాకృష్ణ మాత్రం ఇది నిజమే అనే విధంగా రాజకీయ ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు. మరోసారి అందుకు సిద్ధం అవుతున్నారు.

Show comments