ఉప్పెన Bad Screen Play

70 ఏళ్ల క్రితం విజ‌య‌చిత్ర ప్రారంభ సంచిక‌లో రావికొండ‌లరావు ఫ‌స్ట్ ఎడిటోరియ‌ల్‌లో “మంచే చెబుతాం, చెడు ఉన్నా చెప్పం” అని రాసారు. విజ‌య‌చిత్ర అదే స్టాండ‌ర్డ్స్‌తో వ‌చ్చింది. గాసిఫ్స్ రాయ‌లేదు.

ఇదే సూత్రం స‌భ‌ల‌కి కూడా వ‌ర్తిస్తుంది. మొన్న ఉప్పెన స‌భ‌లో చిరంజీవి విప‌రీతంగా పొగిడారు. ది బెస్ట్ స్క్రీన్ ప్లే అన్నారు. మేన‌ల్లుడి మొద‌టి సినిమా అలా అన‌డం స‌హ‌జ‌మే. చిరంజీవి నాలుగు మంచి మాట‌లు మాట్లాడితే సినిమాకి ప్ల‌స్ అవుతుంది. చిరంజీవే కాదు, ఆ ప్లేస్‌లో ఎవ‌రున్నా అదే క‌రెక్ట్‌. మ‌ర్యాద‌, సంస్కారం కూడా. ఆయ‌న స‌భా మ‌ర్యాద తెలిసిన వ్య‌క్తి. రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న ఎక్కువ మ‌ర్యాద పాటించారు. అదే మైన‌స్ అయ్యింది.

చిరంజీవితో పాటు చాలా మంది ప్ర‌ముఖులు ఉప్పెన ఒక అద్భుతం అన్నారు. ఈ హైప్ చూసి సినిమాకెళ్లిన వాళ్లు నిరాశ ప‌డ్డారు. మ‌రీ అన్యాయం కాదు కానీ, వీళ్లు చెప్పినంత లేద‌ని అర్థ‌మైంది. ఉప్పెనకి చాలా ప్ల‌స్ పాయింట్లున్నాయి. మంచి పాట‌లు, ఫొటోగ్ర‌ఫీ, ఎడిటింగ్‌, ఆర్ట్‌, అక్క‌డ‌క్క‌డ మంచి డైలాగ్‌లు, సుకుమార్ గైడెన్స్‌, ఉప్పాడ స్థానికుడు కావ‌డంతో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకి నేటివిటీ మీద ప‌ట్టు, న‌ట‌న తెలిసిన హీరోయిన్ (ఇదే అన్నిటి కంటే క‌ష్టం), కొత్త వాడైన ఈజ్‌గా చేసిన హీరో, విజ‌య్ సేతుప‌తి లాంటి విల‌న్ ఇన్ని ఉన్నా ఈ సినిమా ఎందుకు బోరు కొట్టిందంటే డైరెక్ట‌ర్ కొత్త సీన్లు రాసుకోక‌పోవ‌డం. స్క్రీన్ ప్లేలో వేగం మంద‌గించ‌డం.

ప్రేమ క‌థ‌ల‌న్నీ ఒక్క‌లాగే వుంటాయి. డ‌బ్బున్న అమ్మాయిని, పేద హీరో ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తండ్రి విల‌న్‌, లేదంటే అన్న‌య్య (సీతాకోక చిలుక‌, సైరాత్‌). ఇదే క‌థ‌ని రివ‌ర్స్‌లో చెబితే నువ్వునేను, బాబీ (హిందీ) , అనార్క‌లి నుంచి ఉప్పెన వ‌ర‌కూ ఎవ‌రు చెప్పినా ఇదే క‌థ‌. కాలం , ప‌రిస్థితులు, క్యారెక్ట‌ర్లు మారుతాయి.

డైరెక్ట‌ర్ బుచ్చిబాబు క్లైమాక్స్‌ని కొత్త పాయింట్‌గా న‌మ్మాడు. ఆడియ‌న్స్ షాక‌వుతారు. అదే సినిమాని హిట్ చేస్తుంద‌నుకున్నాడు. అయితే తెర మీద జ‌రిగేదాన్ని మ‌నం ఫీలై Pain generate కావాలంటే స్క్రీన్‌కి, ఆడియ‌న్స్‌కి మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్కౌట్ కావాలి. సీన్స్ అన్నీ ఇది వ‌ర‌కే చూసిన‌ట్టు అనిపించ‌డ‌మే కాదు. క్యార‌క్ట‌రైజేష‌న్ మిస్ అయ్యింది.

విజ‌య్ సేతుప‌తి మాత్రమే అంతోఇంతో రిజిస్ట‌ర్ అవుతాడు. హీరోకి “గ” అక్ష‌రం ప‌ల‌క‌దు అంటారు. అదెందుకో తెలియ‌దు. రంగ‌స్థ‌లంలో హీరోకి విన‌ప‌డ‌దు అంటే క్లైమాక్స్‌కి అదే బ‌ల‌మైన పాయింట్‌. హీరోయిన్ హీరో ప్రేమ‌లో ప‌డ‌డానికి బ‌ల‌మైన సీన్ లేదు. ఎవ‌న్నో కొడుతూ వుంటే ల‌వ్‌లో ప‌డుతుంది. వెనుక‌టికి విఠ‌లాచార్య ఏమ‌నే వాడంటే “కాంతారావు, కృష్ణ‌కుమారి ప్రేమ‌లో ప‌డ‌తార‌ని ఆల్రెడీ ఆడియ‌న్స్‌కి తెలుసు. అన‌వ‌స‌రంగా ఫిల్మ్ వేస్ట్ చేయ‌డ‌మెందుకు?” అందుకే క‌ళ్లు ట‌పట‌ప ఆర్పి రెండే డైలాగ్‌ల్లో ల‌వ్ స్టార్ట్ అయ్యేది. అప్ప‌టికి జ‌రిగింది.

కానీ ఉప్పెన బ‌ల‌మే ప్రేమ‌. ఒక్క సీన్ అయినా కొత్త‌గా చూస్తున్న‌ట్టు లేదు. వైష్ణ‌వ తేజ్ బాగున్నాడు. కొన్ని సీన్స్‌లో మ‌న ఊరి పాండ‌వులు నాటి చిరంజీవిని గుర్తుకు తెచ్చాడు. న‌ట‌న‌లో ఈజ్ ఉంది, అయితే చిరంజీవి ముద్ర వ‌దిలించుకుని సొంతంగా నిల‌బ‌డాలి. రెండో సినిమాకే మిస్ట‌ర్ సుప్రీం అని బిరుదు వేయించుకుని , చిరంజీవి పాత పాట‌ల్ని రీమేక్ చేస్తే ప‌రిశ్ర‌మ‌కి ఇంకో హీరో వ‌స్తాడంతే, న‌టుడు కాదు.

తండ్రీకూతుళ్ల మ‌ధ్య లాస్ట్ సీన్ పండ‌క‌పోతే జ‌నం న‌వ్వుకునే వాళ్లు. అక్క‌డ డైరెక్ట‌ర్ పాసై పోయాడు. అయినా ఆడియ‌న్స్ తెలివి మీరి పోయారు. క్లాస్ రూంలో మ‌గ‌త‌నం గురించి టీచ‌ర్ చెప్పిన‌ప్పుడే వాళ్ల‌కి విష‌యం అర్థ‌మైంది.

ట్విస్ట్‌లు తెలిసిపోయినా ఆడియ‌న్స్ కూచోవాలంటే క‌థ, స్క్రీన్‌ప్లే బ‌లంగా వుండాలి. బ‌లం కావాలంలే మొక్క‌ని మ‌నం నీళ్లు పోసి పెంచాలి. ఎక్క‌డో పెరిగిన మొక్క‌ని మ‌నం పెర‌ట్లో నాటితో వేళ్లు బ‌ల‌ప‌డ‌వు. ఉప్పెన‌కి ఆగ‌దు.

సుకుమార్ నుంచి బుచ్చిబాబు నేర్చుకోవాల్సింది లెక్క‌లు కాదు, క్యార‌క్ట‌రైజేష‌న్‌. రంగ‌స్థ‌లం క్లైమాక్స్ తెలిసినా బోర్ కొట్ట‌దు. కార‌ణం క్యారెక్ట‌ర్లు. అన‌సూయ‌, ఆది, న‌రేష్‌, అజ‌య్ ఘోష్‌, రోహిణి ప్ర‌తివాళ్లు గుర్తుంటారు. ఉప్పెన‌లో సాయిచంద్ కూడా ముద్ర వేయ‌లేక‌పోయాడు. ఉప్పెన‌కి డ‌బ్బులు రావ‌చ్చు, ఆడ‌చ్చు. కానీ నిల‌బ‌డే సినిమా కాదు. అలాగ‌ని బుచ్చిబాబు బ్యాడ్ డైరెక్ట‌ర్ కాదు. అందుకే రెండో సినిమా బాగా తీస్తాడ‌ని ఆశ‌!

Show comments