iDreamPost
iDreamPost
లాక్ డౌన్ రూపంలో కరోనా తెచ్చిన ప్రకంపనలు అన్ని ఇన్ని కావు. సినిమా టీవీ అనే భేదం లేకుండా మొత్తం స్థంబించిపోయాయి. సీరియల్స్ షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో రేటింగ్స్ తో పాటు యాడ్స్ తగ్గిపోయి ఛానల్స్ లబోదిబోమంటున్నాయి. వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ప్రేక్షకులకు ఒకరకమైన విసుగు తెప్పించారనే చెప్పాలి. ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ మీద అవగాహన లేని కామన్ ఆడియెన్స్ వాటినే చూస్తూ రిపీట్ రన్స్ కు సైతం ఆదరణ కలిగిస్తున్నారు.
ఇక వీటి స్టాక్ కూడా క్రమంగా అయిపోతోంది. ప్రత్యాన్మయం కోసం ఇప్పుడు ఛానల్స్ వెబ్ సిరీస్ ని టెలికాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. దీనికి జీ తెలుగు శ్రీకారం చుట్టింది. నిన్నటి నుంచి క్వీన్ ని రాత్రి 8 గంటల నుంచి ప్రసారం చేస్తోంది. టైటిల్ రోల్ రమ్యకృష్ణ కావడంతో జనంలో ఆసక్తి ఉంది. ఇది కొన్ని నెలల క్రితం ఎంఎక్స్ ప్లేయర్ యాప్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. వివిధ బాషలలో అనువదించారు కూడా. తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ లో రమ్యకృష్ణ టైటిల్ రోల్ చేశారు. రివ్యూలు రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. అయితే ఇది అందరికి రీచ్ అయ్యుండదనే ఉద్దేశంతో జీ కొత్త ఎత్తుగడతో దీన్ని మొదలుపెట్టింది. దీన్ని మిగలిన ఛానల్స్ కూడా అనుసరించే అవకాశం లేకపోలేదు.
అయితే తెలుగులో స్ట్రెయిట్ వెబ్ సిరీస్ లు చాలా తక్కువ. అవి కూడా జీలోనే ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా హింది, ఇంగ్లీష్ లో రూపొంది తెలుగు డబ్బింగ్ ద్వారా అందుబాటులో ఉన్నవి కనక ప్రసారం చేస్తే రెస్పాన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. పూర్తి స్థాయిలో షూటింగులు మొదలుపెట్టడానికి ఇంకో నెలా రెండు నెలలు పట్టేలా ఉండటంతో ఇతర ఛానల్స్ కూడా ఈ విధమైన ఆప్షన్స్ ని పరిశీలిస్తున్నాయి. ఒకవేళ వర్కౌట్ అయితే మరిన్ని వెబ్ సిరీస్ లు బుల్లితెరపై ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. పేర్లు వేరైనా సీరియల్స్, వెబ్ సిరీస్ స్వరూపం ఒకటే. కాకపోతే డిజిటల్ కంటెంట్ లో క్వాలిటీ తో పాటు కంటెంట్ కూడా స్టాండర్డ్ లో ఉంటుంది. స్టార్ మాకు ఎలాగూ హాట్ స్టార్ తో టై అప్ ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు పడినా ఆశ్చర్యం లేదు