Sajjanar,allu arjun -అల్లు అర్జున్ కు సజ్జనార్ నోటీస్

టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ కి ఆర్టీసి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. రాపిడో సంస్థ ప్రకటనకు సంబంధించి నోటీసులు జారీ చేసింది ఆర్టీసి యాజమాన్యం. తమ బస్సులను కించపరిచే విధంగా ప్రకటన రూపొందించారు అంటూ ఆర్టీసి ఎండీ వీసి సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ ప్రకటన ఇప్పుడు యుట్యూబ్ లో వైరల్ గా మారిన నేపధ్యంలో దానిపై ఆర్టీసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాడ్ లో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని చెప్తూ… రాపిడో చాలా వేగంగా మరియు సురక్షితంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేసారు.

ఆ టైం లో మసాలా దోసను సిద్ధం చేస్తుందని చెప్పడం ఈ యాడ్ లో ఉంటుంది. దీనిపై ఆర్టీసి ఉద్యోగులతో పాటుగా పలువురు ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో దీనిపై స్పందించిన ఎండీ… దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ప్రజా రవాణా విషయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆర్టీసి బస్సులను ఏ విధంగా తక్కువ చేసి చూపిస్తారనే ప్రశ్నలు వస్తున్న నేపధ్యంలో ఎండీ కీలక సూచనలు చేసారు.

తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కించపరిచే చర్యలను సంస్థ యాజమాన్యం గాని ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహించరని స్పష్టం చేసారు. మెరుగైన మరియు పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో నటులు నటిస్తే బాగుంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థ పేదలు, సామాన్య ప్రజల సేవలో ఉన్న నేేపథ్యంలో యాడ్ లో నటించిన హీరో అల్లు అర్జున్ కి అలాగే ఈ యాడ్ ను తయారు చేసిన రాపిడో కి లీగల్ నోటీసులను పంపిస్తున్నామని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

అదే విధంగా తాము ఇప్పటికే బస్సులు, బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపైనా, బస్సుల్లో, బయట పాన్ మరియు గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే హోదాలో ఉన్న నటులు, అలాగే ఇతర ప్రముఖులు ఇలాంటివి చేయకూడదు అని, ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే విషయాలను ప్రచారం చేయకుండా ఉంటే బాగుంటుందని సజ్జనార్ సూచించారు.

Also Read : Nara Lokesh, Election Campaign – వాళ్ళని నమ్మినంత కూడా చినబాబుని నమ్మలేదా?

Show comments