Idream media
Idream media
స్కోర్ టై.. ఈ పదం సాధారణంగా క్రికెట్ ఆటలో వింటుంటాం. ఇరు జట్ల స్కోరు సమం అయినప్పుడు.. మ్యాచ్ టై అయిందని ప్రకటిస్తారు. విజేతను నిర్ణయించేందుకు అంపైర్లు టాస్, సూపర్ ఓవర్ తదితర వివిధ విధానాలను పాటిస్తారు. మ్యాచ్ హోరాహోరీగా సాగినప్పుడు ఇలాంటి ఫలితం వస్తుంది. క్రికెట్ మాదిరిగానే.. తాజాగా ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరుసాగింది. ఓట్లు ఇద్దరికీ సమానంగా వచ్చాయి. పలు చోట్ల ఒకటి, రెండు ఓట్లతో విజయాలు వరించాయి. ఈ ఫలితాలు.. పంచాయతీ ఎన్నికలకు ఉన్న ప్రాథ్యానతను తెలియజేస్తున్నాయి.
ఫలితం టై…
అనంతపురం జిల్లాలో తొలి విడతలో భాగంగా పట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోని 12 మండలాల్లో 169 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. గాండ్లపెంట మండలం సామలగొంది పంచాయతీలో ఫలితం టైగా తేలింది. ఈ పంచాయతీలో 935 ఓట్లు ఉండగా.. 815 ఓట్లు పోలయ్యాయి. నోటా, చెల్లనివి పోను ఇద్దరు అభ్యర్థులకు చెరో 400 ఓట్లు వచ్చాయి. రీ కౌంటింగ్ చేసినా అదే ఫలితం వచ్చింది. పట్టపర్తి మండలం బొంతలపల్లిలోనూ ఫలితం టైగా వచ్చింది. ఇక్కడ 862 ఓట్లు ఉండగా.. 794 ఓట్లు పోలయ్యాయి. చెల్లనివి, నోటా పోను ఇద్దరికీ సమంగా ఓట్లు వచ్చాయి. ఈ రెండు పంచాయతీల్లోనూ అధికారులు లాటరీ విధానంలో విజేతలను ఎంపిక చేశారు.
ఒక్క ఓటుతో విజయాలు..
రాష్ట్ర వ్యాప్తంగా పలు పంచాయతీల్లో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు సాగాయి. ఒక్క ఓటుకు ఉన్న ప్రాధాన్యతను ఈ ఎన్నికలు చాటి చెప్పాయి. గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో సర్పంచ్ అభ్యర్థి గోవిందమ్మ ఒక ఓటు తేడాతో గెలిచింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం యరజర్ల పంచాయతీలో ఒక్క ఓటు తేడాతో తిమ్మశెట్టి రాములమ్మ గెలిచారు. నెల్లూరు జిల్లా పామూరుపల్లి పంచాయతీ సర్పంచ్‌గా తెలగొర్ల సుశీల ఒక్క ఓటుతో గెలిచారు. రీ కౌంటింగ్ చేసినా ముదటి ఫలితమే పునరావృతమైంది. ఇదే జిల్లా అల్లూరు మండలం పడమర పల్లిలోనూ ఐదు ఓట్లతో సర్పంచ్ ఫలితం వెలువడింది.
సింగిల్ డిజిట్ మెజారిటీలు..
అనంతపురం జిల్లా పట్టపర్తి మండలం పైపల్లి పంచాయతీలో లెక్కల ప్రవీణ్ అనే అభ్యర్థి 2 ఓట్లతో గెలిచారు. ఇదే జిల్లా అమడగూరు మండలం చినగానిపల్లిలో 4 ఓట్ల తేడాతో సర్పంచ్‌గా సరస్వతి విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం పి.దొంతమూరులో రెండు ఓట్ల తేడాతో వైసీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడులో వైసీపీ బలపర్చిన అభ్యర్థి 8 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో శైలిషా 8 ఓట్ల తేడాతో గెలిచారు. ఒంగోలు మండలం దేవరంపాడులో నన్నపనేని వెంకటేశ్వరరావు 9 ఓట్టు, బొద్దులూరివారి పాలెంలో కాట్రగడ్డ కవిత 7 ఓట్లతో విజయం సాధించారు.