అందరి గురి..తిరుపతి బరి!

  • Published - 03:42 AM, Sat - 27 February 21
అందరి గురి..తిరుపతి బరి!

నిన్నమొన్నటివరకు….. ఏపీలో పంచాయతీ ఎన్నికల కోలాహలం. ఇక మున్సిపల్‌ సమరం ప్రారంభం కానుంది. పార్టీల ప్రాతిపదికన జరిగే పురపాలక, నగరపాలక సంస్థలకు – రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలిసిందే. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో – అక్కడినుండే తిరిగి కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని ప్రకారం నామినేషన్ల ఉపసంహరణలతో  ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న కౌంటింగ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు  ఎందుకు మరింత హీట్ రాజేస్తున్నాయి? తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో – పుర పోరు ఉత్కంఠ రేపుతోంది. తిరుపతి మున్సిపాలిటీ కార్పోరేషన్ గా అప్ గ్రేడ్ అయ్యి దాదాపు దశాబ్దంన్నర కాలం అవుతోంది . మరి తిరుపతి కార్పోరేషన్ గా రూపాంతరం చెందినా ఇంతవరకూ అక్కడ స్థానిక ఎన్నికలు మాత్రం జరగలేదు . కార్పోరేషన్ అయ్యి ఇన్నేళ్లు గడిచినా ఎన్నికలు జరగకపోవడమే ఇక్కడ ట్విస్ట్ .

ఏపీలో కరోనా కారణంగా గతంలో వాయిదాపడిన మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఇప్పటికే విడుదల చేసారు . దీని ప్రకారం మార్చి 2న పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 10న ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12 కార్పోరేషన్లతో పాటు  75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే, గతేడాది కరోనా కారణంగా పురపాలక ఎన్నికలు వాయిదా పడేనాటికి నామినేషన్లు పూర్తయ్యాయి. అయితే వాటిని ఉపసంహరించుకునేందుకు అభ్యర్ధులకు ఇచ్చిన గడువుకు ముందే ఎన్నికలు వాయిదా పడిపోయాయి. దీంతో ఇప్పుడు తిరిగి నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రత్యేకంగా మార్చి 2న నోటిఫికేషన్ జారీ అవుతుంది. అలాగే ఒక్కరోజు గడువుతో మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుంది. మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత – అదే రోజు బరిలో ఉన్న అభ్యర్ధుల జాబితాను ఎస్ఈసీ విడుదల చేయనున్నారు.

మార్చి 10న పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమైతే మార్చి 13న నిర్వహిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపును ఆదివారం మార్చి 14న చేపడతారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. 12 నగర పాలక సంస్ధల్లో విజయనగరం, గ్రేటర్ విశాఖ , ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పోరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే అన్ని జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న, కోర్టు కేసులు లేని 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

కాగా తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు జరగనున్న ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది . అదేంటంటే తిరుపతి కార్పోరేషన్ గా రూపాంతరం చెంది దశబ్దంన్నర కావస్తోన్నా అక్కడ ఎన్నికలు జరగకపోవడమే. దీంతో తిరుపతిలో మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి . మేయర్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని, అధికారపార్టీ వైసీపీ విశ్వాసంతో ఉంది. తిరుపతిలో పురపోరు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఇందులో 26 ఎవరు గెలిస్తే వారిదే మేయర్ స్థానం. అధికార వైసీపీ ఇప్పటికే 16 ఏకగ్రీవాలు చేసుకుంది. మరో 8 నామినేషన్ల విత్ డ్రా అయిన సంగతి తెలిసిందే. అంటే దాదాపు 24 డివిజన్లను కైవశం చేసుకుంది. ఇక రెండు గెలిస్తే చాలు.. మేయర్ పదవి వైసీపీకే. ఇదే నమ్మకంతో వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల అనంతరం – బలవంతపు విత్ డ్రాలపై – అభ్యర్థులు మళ్లీ నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

రాష్ట్రంలో పురపాలక పోరుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ లభించిన నాటినుండే – ఎన్నికల సందడి గ్రామాల్లో నుండి పట్టణాలలోకి మారుతోంది. అయితే ఎన్నికల కమీషన్ గతంలో ఎక్కడైతే ప్రక్రియ నిలుపుదల చేశారో అక్కడ నుంచి ప్రారంభించాలని చెప్పడంపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో దాదాపు 18 సంవత్సరాల కిందట – తిరుపతి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చివరిసారిగా ఎన్నికలు జరిగాయి . ఆ తరువాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత, ఎన్నికలు జరగబోతున్నాయి. 2001లో చివరసారిగా పురపోరు నగరంలో జరిగింది. 2007 లో కార్పొరేషన్ గా రూపుదిద్దుకుంది . అయినా సరే, వివిధ కారణాలతో అధికారుల పాలనలోనే కొనసాగుతోంది. గత ఏడాది వాయిదా పడిన ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ సై అనటంతో అన్ని పార్టీల్లో జోష్ వచ్చింది. బిజెపి, జనసేన , టీడీపీ – కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని లేఖల మీద లేఖలు రాస్తున్నాయి. గత ఏడాది నగరంలోని యాభై వార్డులకు అభ్యర్థులను నిలపటంలో బిజెపి, జనసేన, టీడీపీ వెనుకపడ్డాయి. వైసీపీ మాత్రం మేయర్ పీఠానికి ఒక్క అడుగు దూరంలో ఉంది గెలుపు తమకు నల్లేరుమీద నడకే అని చెప్పుకుంటోంది .

ఇన్నేళ్ళుగా… స్థానిక ఎన్నికలు లేకుండా – అధికారుల ఏలుబడిలో ఉన్న తిరుపతి మున్సిపల్‌ కార్పోరేషన్ ఎన్నికల పై ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కందాటి శంకర్‌రెడ్డి చైర్మన్‌గా 2006లో చివరిగా తిరుపతి మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. తిరుపతి నగరానికి – 2007లో మున్సిపల్ కార్పొరేషన్‌ హోదా లభించింది. అయినా ఎన్నికలకు నోచుకోలేదు. గత ముఖ్యమంత్రులెవ్వరూ తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించే సాహసం చేయలేదు.

కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. తన కుమారుడు అభినయ్‌రెడ్డిని రంగంలోకి దించుతున్నారు. అభినయ్‌రెడ్డి స్వయంగా నాలుగో డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక ద్వారా కుమారుడితో ఎన్నికల అరంగేట్రం చేయిస్తున్నారాయన. ఇక చైర్‌పర్సన్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో – వారి ఎంపిక కూడా భూమనే చూస్తున్నారట. డాక్టర్‌ శిరీష, బీసీ నేత రామచంద్ర కుమార్తె పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కొద్దిలో ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న టీడీపీ.. ఇంకా ఆ ఓటమి భారం నుంచి బయటపడినట్లు లేదు. దాంతో, కార్పొరేషన్‌ ఎన్నికలపై టీడీపీ నేతలు ఆసక్తి చూపించడం లేదట. పార్టీకి బలమైన కేడర్‌ ఉన్నా.. గ్రూపు రాజకీయాలు భరించలేక  ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ పరిస్థితి అలా ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీ దుస్థితి మరీ దారుణంగా తయారైందట. ఇక, బీజేపీ, జనసేన లకు తిరుపతిలో బలమైన బలిజ సామాజికవర్గం అండగా ఉన్నా.. వారిని నడిపించే వారు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో రాజకీయ పార్టీలకు కార్పొరేషన్‌, మున్సిపల్ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ గుర్తులపై జరిగే ప్రధాన ఎన్నికలు కాబట్టి . గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీల జెండాలు, ఎన్నికల గుర్తులు లేకుండా జరగడంతో గెలిచిన వారందరూ తమ వారేనని పోటిపడి మరి పార్చీలు ప్రచారం చేసుకున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయితీ ఎన్నికల పరిస్థితి అలా కాదు. పార్టీల ఎన్నికల గుర్తుతో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో… ఎవరి బలం ఎంతో స్పష్టంగా తెలియ నుంది. 2001 జనవరిలో తిరుపతి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. ఆ పాలకమండలి కాలపరిమితి 2006కు పూర్తయ్యింది. అప్పటి నుంచి ఇప్పుడు.. అప్పుడు అని ఊరిస్తున్న కార్పోరేషన్ ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు. ఇన్నాళ్ల తరువాత తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఇదే ప్రస్తుతం తిరుపతి రాజకీయంగా హీటెక్కిస్తోంది.

ఏది ఏమైనా… తిరుపతి పార్లమెంట్ బైపోల్స్ కు ముందే – నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతుండటం , నగరపాలక సంస్థ ఏర్పాటైన దశాబ్దంన్నర తరవాత ఎన్నికలు జరగనుండటమే సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

Show comments