టిక్ టాక్,హెలో, షేర్ ఇట్ సహా 59 చైనా అప్లికేషన్లను నిషేధించిన భారత ప్రభుత్వం

  • Published - 03:49 PM, Mon - 29 June 20
టిక్ టాక్,హెలో, షేర్ ఇట్ సహా 59 చైనా అప్లికేషన్లను నిషేధించిన భారత ప్రభుత్వం

గల్వాన్ లోయ వద్ద చైనా సైనికులతో భారత సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో తెలుగుతేజం కల్నల్ సంతోష్ బాబు సహా 21 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీంతో భారత్ మరియు చైనా దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భారత సైనికులపై దురుద్దేశపూర్వకంగా దాడి చేసిన చైనా దేశానికి సంబంధించిన వస్తువులను, అప్లికేషన్లు నిషేధించాలన్న ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ అంటూ సోషల్ మీడియాలో పలువురు పిలుపునిచ్చారు. కాగా తాజాగా భారతదేశంలో అధిక జనాదరణ పొందిన టిక్ టాక్, హెలో , షేర్ ఇట్, యూసి బ్రౌజర్ లాంటి 59 చైనా అప్లికేషన్లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

చైనాకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని భావిస్తున్న భారత్ ప్రముఖ చైనా అప్లికేషన్లు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు చైనా కంపెనీలకు ఇచ్చిన టెండర్లు రద్దు చేశారు. భారత ప్రభుత్వం నిషేధించిన అప్లికేషన్లలో టిక్ టాక్, హెలో, యూసి బ్రౌజర్, షేర్ ఇట్ లాంటి బహుళ జనాదరణ పొందిన అప్లికేషన్లు ఉన్నాయి.. ఆయా అప్లికేషన్లకు భారత్ నుండే ఎక్కువ ఆదాయం వస్తుంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. మరికొందరు స్వదేశీ అప్లికేషన్లను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

Show comments