యాభై ఐదు సంవత్సరాల తేనె మనసులు

1965లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఇద్దరు కొత్త హీరోలు, ఇద్దరు కొత్త హీరోయిన్లతో తేనె మనసులు అన్న సినిమా మొదలుపెట్టి పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటికి మంచి పేరున్న ఆదుర్తి గారు ఎవరు కావాలంటే వారితో సినిమా తీయగలిగి కొత్తవారిని ఎందుకు ఎంచుకున్నారో చాలా మందికి అర్థం కాలేదు. నటన, నృత్యంలో శిక్షణ ఇప్పించి షూటింగ్ మొదలుపెట్టారు.

షూటింగ్ జరిగే కొద్దీ ఆదుర్తి గారి కొత్త హీరోల గురించి వివరాలు బయటకు రాసాగాయి. ఒక హీరోని ఆంధ్ర దేవానంద్ అన్నారు. యాక్టింగ్, డాన్సూ బాగా చేస్తున్నాడు. నంబర్ వన్ స్థానానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు పోటీ తప్పదు అన్నారు. తేనె మనసులు షూటింగ్ పూర్తి కాకముందే నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసుకున్నారు ఇతర నిర్మాతలు. రెండో హీరో గురించి నటన సరిగా రాదు, డాన్స్ చేయలేడు. మరో సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశం లేదు అన్నారు.

ఆంధ్ర దేవానంద్ అన్న హీరో పేరు రామ్మోహన్. తేనె మనసులు మొదలయ్యే నాటికే హైదరాబాద్, బేగంపేట విమానాశ్రయంలో ఇంజనీరుగా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెళ్ళి అయి భార్యా బిడ్డలు ఉన్నారు. తేనె మనసులు కోసం లాంగ్ లీవ్ పెట్టి మద్రాసులో ఉన్నాడు.

1965 మార్చి 31న తేనె మనసులు విడుదల అయి అతనికి మంచి పేరు తెచ్చింది. ఆదుర్తి సుబ్బారావు గారే తేనె మనసులు తారాగణంతో కన్నె మనసులు అని మరో సినిమా మొదలుపెట్టారు. అయితే ఈ సరికి రామ్మోహన్ చుట్టూ మిత్ర బృందం చేరింది. మందు, విందు, పొందులలో మునిగిపోయిన రామ్మోహన్ షూటింగ్ కి ఆలస్యంగా పోవడం మొదలు పెట్టాడు. “నువ్వు ఇప్పుడు సూపర్ స్టార్ వి. అందరిలాగా టైమ్ కి పోవడం ఏమిటి” అని మిత్రులు అంటుంటే ఉదయం తొమ్మిది గంటల షెడ్యూల్ కి మధ్యాహ్నం ఒంటి గంటకు పోవడం, మద్యం మత్తులో పోవడం ప్రారంభించాడు. ఆదుర్తి గారు ఎలాగో కన్నె మనసులు పూర్తి చేశారు. ఆ తర్వాత నానా తంటాలు పడి మరో సినిమా విడుదల అయింది. అడ్వాన్స్ ఇచ్చిన మిగిలిన నిర్మాతలు అడ్వాన్స్ పోతేపోయింది అని మొహం చాటేశారు.

సెలవు గడువు తీరిపోయినా ఉద్యోగానికి పోకపోవడంతో ఉద్యోగం లోనుంచి తొలగించారు. సినిమాలలో సంపాదించినది, అంతకు ముందు సేవ్ చేసినది జల్సాలకు, మిత్రబృందం పోషణకూ కరిగిపోయింది. ఇతని ఎఫైర్ల దెబ్బకు భార్య విడాకులు ఇచ్చి, పిల్లలతో సహా వెళ్లి పోయింది. తినడానికి కూడా లేక, హైదరాబాద్ చేరుకుని,అమీర్ పేటలో సైకిళ్లు అద్దెకి ఇచ్చే షాపులో లెక్కలు రాస్తూ కొన్నాళ్లు గడిపి, ఆ తర్వాత ఏమయ్యాడో ఎవరికీ తెలియకుండా పోయాడు.

మరో సినిమా వస్తే గొప్ప అనిపించుకున్న రెండవ హీరో అవకాశాల కోసం ఓపికగా ఎదురు చూసి, క్రమశిక్షణతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. స్టూడియో ఓనర్ అయ్యాడు. తరువాత రోజుల్లో సాహసానికి మారు పేరు అనిపించుకుని ఎన్నో సంచలనాత్మక సినిమాలకు నిర్మాత, దర్శకుడు అయ్యాడు. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ.

Show comments