ఎమ్మెల్సీ పోరుకు కాంగ్రెస్‌ అభ్యర్థులు సిద్ధం

తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. టీఆర్‌ఎస్ కూడా ఓ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. వరంగల్‌ – ఖమ్మం – నల్గొండ స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డినే సీఎం కేసీఆర్‌ ఇటీవల ఖరారు చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా రెండు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. హైౖదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిని, వరంగల్‌ – ఖమ్మం – నల్గొండ స్థానానికి నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి ముకుల్‌ వాస్నిక్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

వాస్తవానికి హైదరాబాద్‌, ఖమ్మం స్థానాల నుంచి పోటీకి కాంగ్రెస్‌ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ముఖ్యంగా చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డిల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలన్నదానిపై తర్జనభర్జనలు జరిగిన తర్వాత చివరికి అధిస్ఠానం చిన్నారెడ్డివైపే మొగ్గు చూపింది. ఇక మొదటి నుంచీ ఖమ్మం స్థానానికి రాములు నాయక్‌ పేరే వినిపించింది. ఆదివాసీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్‌లు కూడా చివరి వరకూ పోటీ పడ్డారు. అధిష్ఠానం రాములు నాయక్‌కే ఓటేసింది.

వరంగల్‌ – ఖమ్మం – నల్గొండ స్థానం నుంచి పోటీ చేస్తున్న సబావత్‌ రాములు నాయక్‌ స్వస్థలం మెదక్‌ జిల్లా నారాయణ ఖేడ్‌. రాజకీయాల్లోకి రాక ముందు కార్మికశాఖలో ఆరేళ్లు ఉద్యోగం నిర్వహించారు. పలు ట్రేడ్‌ యూనియన్లకు నాయకుడిగా వ్యవహరించారు. సుమారు 20 ఏళ్ల పాటు ఆయా సంఘాలలో కార్మికుల తరఫున పోరాడారు. 2004లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

రాములునాయక్ 2014లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో టీఆర్‌ఎస్ అధిష్ఠానం‌ సస్పెండ్‌ చేసింది. గిరిజనులకు రిజర్వేషన్లు కోరినందుకే తనపై వేటు వేశారంటూ రాములునాయక్‌ టీఆర్‌ఎస్‌పై ఆరోపణల వర్షం కురిపించారు. 2018లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గిరిజన రిజర్వేషన్ల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై గతంలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఉపవాస దీక్ష కూడా చేశారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప‌ట్ట‌భ‌ద్రుల కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది.

హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్న జిల్లెల చిన్నారెడ్డి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నిక‌య్యారు. 1985లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతగా ఉండే చిన్నారెడ్డి వనపర్తి నుంచి తొలిసారి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణయ్య చేతిలో ఓడిపోయారు. 1989లో అదే అభ్య‌ర్థిపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 1994లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రావుల చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు. మ‌ళ్లీ 1999లో రావుల చంద్రశేఖర్‌పై 3500 మెజారిటీతో విజయం సాధించారు. 2004లో ఐదవసారి పోటీలో దిగి వరుస విజయం సాధించి మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పని చేశారు. 2009లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి రావుల చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఏఐసీసీ కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు.

Show comments