ఎవ‌రి ‘దారి’ వారిదే… టి.కాంగ్రెస్ మార‌దే!

క‌లిసి ప‌ని చేస్తే క‌ల‌దు లాభం అన్న సంగ‌తి కాంగ్రెస్ ఎప్ప‌టికి గుర్తిస్తుందో తెలియ‌డం లేదు. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కొంద‌రు ఎవ‌రికి వారు త‌మ ప‌ర‌ప‌తి పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు త‌ప్పా.. పార్టీ ప్ర‌తిష్ట‌త పెంచే చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డం లేద‌నేది ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే అర్థం అవుతోంది. తెలంగాణ‌లో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌లే ఇందుకు నిద‌ర్శ‌నం.

టీపీసీసీ కోస‌మో.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మో.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూప‌డానికో తెలియ‌దు కానీ.. టీపీసీసీ సార‌థిగా ఉత్త‌మ్ రాజీనామా చేసినప్ప‌టి నుంచీ ప్ర‌తి ఒక్క‌రూ పాద‌యాత్రల మాట ఎత్తుతున్నారు. పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కాంగ్రెస్ ను అధికారంలో తెస్తాన‌ని ఆరంభంలోనే ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత జ‌గ్గారెడ్డి కూడా పాద‌యాత్ర అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. మ‌రికొంద‌రు నేత‌లు కూడా అదే ప‌ల్ల‌వి అందుకుంటుండ‌గా..

మ‌రో ఎంపీ రేవంత్ రెడ్డి కార్య‌చ‌ర‌ణ లోకి దిగిపోయారు. రైతు స‌మ‌స్య‌ల‌పై అంటూ అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాద‌యాత్ర ఇప్ప‌టికే ఏడో రోజుకు చేరుకుంది. ఆ పాద‌యాత్ర ద్వారా రేవంత్ కు ఎంత మేలు జ‌రిగిందో తెలియ‌దు కానీ.. పార్టీకి మాత్రం కీడే జ‌రుగుతుంద‌ని చెప్పొచ్చు. తాజాగా నేత‌ల మ‌ధ్య చిచ్చుకు రేవంత్ పాద‌యాత్ర కార‌ణ‌మ‌వుతోంది.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం రైతులతో ముఖాముఖీ అంటూ పాద‌యాత్ర చేస్తున్నారు. ఆదిలాబాద్‌ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం యాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రగతి భవన్‌ ముట్టడి అని ఆయన ఇప్పటికే షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మరి.. పార్టీ పెద్దలు ఓకే చెప్పారో లేదో కానీ.. ఆయన మాత్రం ప్రగతి భవన్‌ వరకు పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేస్తున్నారు.

ఈ నెల 22 నుంచి వారం రోజుల పాటు జగ్గారెడ్డి పాదయాత్ర కొనసాగనున్న‌ట్లు తెలుస్తోంది. సదాశివపేట నుండి గన్ పార్క్ వరకు పాదయాత్రకు జగ్గారెడ్డి నిర్ణయించారు. ఇప్పుడు తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈనెల 20 నుంచి ప్రాజెక్టుల సాధన యాత్ర పేరుతో కోమటిరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్ర‌స్తుతం ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌లులో ఉన్నందున పాద‌యాత్ర‌కు అనుమతి కోరుతూ ఈసీకి కోమటిరెడ్డి లేఖ కూడా రాశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ నుంచి జలసౌధ వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో వెల్లడించిన‌ట్లు తెలిసింది.

ఇలా టీకాంగ్రెస్ లోని సీనియ‌ర్ నేత‌లంద‌రూ త‌లోదారి ఎంచుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అధిష్ఠానం నిర్ణ‌యం మేర‌కో, పార్టీ ప‌రంగానో ఏదో అంశాన్ని ఎంచుకుని క‌లిసిక‌ట్టుగా పాద‌యాత్ర చేప‌డితే బావుండేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎవరికి వాళ్లు తాము రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తామని ప్ర‌క‌టించుకోవ‌డం పార్టీలోని అనైక్య‌త‌ను బ‌హిరంగం చేస్తుంద‌ని చెబుతున్నారు.

అస‌లే ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప‌రిస్థితి పెనం లోంచి పొయ్యిలో ప‌డ్డట్లు ఉంది. దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తీవ్ర ఓట‌మిని చ‌విచూసింది. త్వ‌ర‌లో నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌, ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి నోటిఫికేష‌న్ కూడా విడుద‌లైంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో క‌లిసిక‌ట్టుగా పార్టీని గెలిపించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించాల్సింది పోయి ఎవ‌రికి వారు త‌లోదారి ఎంచుకోవ‌డం మంచిక‌న్నా కీడే జ‌రుగుతుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Show comments