Team India got 14 runs on single ball: IND VS BAN: ఒకే ఓవర్లో కాదు.. ఒకే బంతికి 14 పరుగులు

IND VS BAN: ఒకే ఓవర్లో కాదు.. ఒకే బంతికి 14 పరుగులు

వన్డే వరల్డ్ కప్ రసవత్తరంగా సాగిపోతోంది. లీగ్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. కాగా నేడు భారత్, బంగ్లా మధ్య పూణే వేదికగా కీలక పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సందర్భం చోటుచేసుకుంది. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇదో రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకే ఓవర్లో ఆరు బాల్స్ కు ఆరు సిక్స్ లు కొడితే 36 రన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకే బాల్ కు 14 రన్స్ రాబట్టింది టీమిండియా. దీంతో ఒకే ఓవర్లో కాకుండా ఒకే బాల్ కు 14 రన్స్ వచ్చినట్లైంది.

కాగా పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లా పేసర్ హసన్ 13వ ఓవర్లో 5 వ బంతిని నోబాల్ వేయగా.. దానికి 2 పరుగులు వచ్చాయి. అనంతరం వేసిన ఫ్రీ హిట్ ను కోహ్లీ బౌండరీగా మార్చాడు. అయితే ఈ బాల్ కూడా నోబాల్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో మరో ఫ్రీహిట్ లభించగా ఆ బాల్ ను సిక్స్ గా మార్చారు. వీటితో పాటు రెండు ఎక్స్ ట్రాలు తోడవడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. హసన్ వేసిన 13వ ఓవర్లో ఫైనల్ గా 23 రన్స్ వచ్చాయి. ఇదే ఓవర్లో హిట్ మ్యాన్ భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ రూపంలో వికెట్ చేజార్చుకున్నాడు.

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేనకు మంచి శుభారంబం లభించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, శుభ్ మన్ గిల్ మెరుపు బ్యాటింగ్ తో భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హిట్ మ్యాన్ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో విరుచుకుపడి 48 రన్స్ చేశాడు. 55 బంతులు ఆడిన గిల్ 5 ఫోర్లు, 2 సిక్స్ లతో చెలరేగి 53 పరుగులు సాధించాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో భారత్ ఛేదనలో అదరగొడుతోంది. 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో కింగ్ కోహ్లీ 65 పరుగులు, రాహుల్ 13 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.

Show comments