Darsi Municipality – బోణికొట్టిన టీడీపీ.. దర్శి నగర పంచాయతీ కైవసం

మినీ మున్సిపల్‌ ఎన్నికల్లో సంచలనం చోటు చేసుకుంది. ఒక కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. అనూహ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక నగర పంచాయతీని కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో టీడీపీ జెండా ఎగిరింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా.. 13 చోట్ల టీడీపీ గెలిచింది. ఏడు వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది.

ప్రారంభం నుంచి దర్శిలో హోరాహోరీ పోరు నెలకొంది. నామినేషన్ల సమయంలోనూ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనేలా తలపడ్డాయి. ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో వివాదం రేగింది. ఒకే వార్డులో టీడీపీ తరఫున తండ్రీ కొడుకులు నామినేషన్‌ వేయగా.. తండ్రి వెళ్లి.. ఇద్దరి నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు పత్రాలు అందించారు. అయితే కుమారుడిని తీసుకెళ్లిన టీడీపీ నేతలు.. బీ ఫాం అందించారు. అయితే అప్పటికే నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్లు పత్రాలు ఇచ్చారని తెలపడంతో.. టీడీపీ నేతలు ఆందోళన చేశారు. అధికార పార్టీపై విమర్శలు చేశారు.

ఒక్క వార్డును వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా.. మిగతా 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. దర్శిలో టీడీపీ పాలక మండలి ఏర్పాటు ఖాయమైంది. ఇక్కడ అసెంబ్లీకి వైసీపీ తరఫున మద్దిశెట్టి వేణుగోపాల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎక్స్‌ అఫిషియో ఓటు వైసీపీకి ఉన్నప్పటికీ.. టీడీపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో.. దర్శి నగర పంచాయతీలో టీడీపీ పరిపాలన సాగనుంది. ప్రకాశం జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితిని చూసి నిరాశలో ఉన్న ఆ పార్టీ శ్రేణులకు ఈ విజయం మంచి ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

Also Read : Municipol Results – కమలాపురం, బేతంచెర్ల, పెనుకొండ, రాజంపేటల్లో వైఎస్సార్సీపీ జెండా

Show comments