ఈమాత్రం దానికి పాదయాత్ర ఎందుకు లోకేష్?

అంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. గత ఎన్నికల్లో 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావడం అంత తేలికైన విషయం కాదు. అధికార వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉంది. ఈసారి 175కి 175 సీట్లు గెలవాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. టీడీపీ విషయానికొస్తే ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు అంటున్నారు. వయస్సు రీత్యా.. గెలిస్తే నాలుగైదేళ్లకి, ఓడిపోతే వెంటనే రాజకీయాలకు విరమణ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటానని ఆయన చెప్పకనే చెప్పేశారు. దీంతో టీడీపీ శ్రేణులు నారా లోకేష్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

చంద్రబాబు కుమారుడిగా తప్ప లోకేష్ ఇప్పటివరకు బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకోలేదు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే సత్తా ఆయనకి ఉందని పార్టీ శ్రేణుల్లో ఇంకా పూర్తి నమ్మకం కలగలేదు. గత ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడం పెద్ద మైనస్ అయింది. పైగా ఆయనకు తెలుగు భాష మీద పెద్దగా పట్టులేదు. మాట తీరు కూడా పవర్ ఫుల్ గా ఉండదు. దీంతో ప్రత్యర్థులు ఆయనను టార్గెట్ చేస్తూ దారుణంగా విమర్శలు చేస్తుంటారు. అయితే లోకేష్ మాత్రం ఈసారి ఎమ్మెల్యేగా గెలవడం మాత్రమే కాదు.. రాష్ట్ర స్థాయిలో సత్తా చూపించాలి అనుకుంటున్నాడు. అందుకేనేమో పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ పాదయాత్ర కోసం లోకేష్ అనుసరిస్తున్న వ్యూహలే.. విషయం తక్కువ, ఆర్భాటం ఎక్కువ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ నాయకుడైనా ప్రజలకు దగ్గరవ్వడం కోసం పాదయాత్ర చేస్తాడు. నేరుగా ప్రజలతో మాట్లాడి, వారి కష్టాలు తెలుసుకొని, నేనున్నాను అనే భరోసా ఇవ్వడం పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ లోకేష్ మాత్రం ప్రజలతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వారికి ఎలా దగ్గరవ్వాలి? అనే విషయాల మీద కాకుండా.. పాదయాత్రను ఎలా ప్రచారం చేసుకోవాలి అనే దాని మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తన పాదయాత్రను ఎలా ప్రచారం చేయాలి అనే దానిపైనే తన వాళ్ళతో చర్చిస్తున్నాడట. దీని కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. భారీగా ఖర్చు పెట్టి, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తన పాదయాత్రే కనిపించేలా చేయాలి అనుకుంటున్నాడట.

నాయకుడిగా లోకేష్ నమ్మకం కలిగించాలంటే.. ప్రజలతో మాట్లాడాలి, వారికి బాగా దగ్గరవ్వాలి. దానికి ప్రచారాలు అక్కర్లేదు.. నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళి, మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలు. ఈ సోషల్ మీడియా ప్రచారాలు.. సొంత పార్టీ శ్రేణుల భజనకు తప్ప, ప్రజల హృదయాన్ని గెలుచుకోలేవు అనే విషయాన్ని లోకేష్ గ్రహిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show comments