Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. తమ పార్టీ కార్యాలయంపై, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ.. శనివారం వరకు హడావుడి చేసిన టీడీపీ.. ఈ రోజు ఢిల్లీ వెళ్లింది. శాంతిభద్రతలు అదుపుతప్పాయని చెబుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే వినతిని.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందించేందుకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ బృందం హస్తినకు చేరుకుంది. రాష్ట్రపతితో భేటీ అనంతరం.. వీలైతే కేంద్ర మంత్రులను కూడా బాబు బృందం కలుస్తుందంటూ అనుకూల మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఓ పక్క చంద్రబాబు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదుల అస్త్రాలు ప్రయోగిస్తుంటే.. అదే సమయంలో.. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాత్రం కనిపించకుండా పోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని దూషించి, రాష్ట్రంలో అశాంతికి కారణమైన కేసులో అరెస్ట్ అయిన పట్టాభి శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు వస్తున్న సమయంలో గన్నవరం టోల్‌ప్లాజా వద్ద పట్టాభి వాహనం వెనుక వస్తున్న టీడీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు నిలిపివేశారు. పట్టాభి వాహనం మాత్రం యథావిధిగా వెళ్లిపోయింది. ఆ వెనుకే పోలీసు వాహనాలు కూడా వెళ్లాయి.
ఈ ఘటనతో పట్టాభిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారనే అనుమానం టీడీపీ శ్రేణులు, పట్టాభి కుటుంబ సభ్యుల్లో నెలకొంది. అయితే కొద్దిసేపటికే.. పట్టాభి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. తాను క్షేమంగా ఉన్నానని, పోలీసుల అదుపులోలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన నివాసంలో కూడా లేరు. ఎక్కడ ఉన్నారనే విషయం కుటుంబ సభ్యులకు, కొంత మంది టీడీపీ నేతలకు తప్పా మరెవరికీ తెలియదు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే అభియోగాలపై పట్టాభిపై ఇంకా నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసుల్లో మళ్లీ పోలీసులు తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో..పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఓ పక్క టీడీపీ అధినేత చంద్రబాబు..తమ అధికారప్రతినిధి పట్టాభి ఏ తప్పూ చేయలేదని చెబుతుంటే.. పట్టాభి మాత్రం అందుకు భిన్నంగా తప్పు చేసినవాడి మాదిరిగా భయంతో దాక్కోవడం విశేషం.
Also Read : Bail For Pattabhi – పట్టాభికి బెయిల్.. రెండు రోజుల్లోనే బయటకు..