టీడీపీ సీనియ‌ర్ల‌కు ఓట‌ర్ల చెల్లు చీటీ..!

పంచాయతీ ఎన్నికల నామినేష‌న్ల ప‌ర్వం, వెల్ల‌డైన ఫ‌లితాల‌ను బ‌ట్టి తెలుగుదేశం పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్ల హ‌వా త‌గ్గింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, ఎమ్మెల్యేగా, మంత్రులుగా చెలామ‌ణి అయిన నాటి వైభ‌వం.. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేద‌ని ఆయా ప్రాంతాల్లో ఫ‌లితాల స‌ర‌ళ‌ని బ‌ట్ట అర్థ‌మ‌వుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొదటి విడత హవాను కొనసాగిస్తూ టీడీపీ ముఖ్యనాయకుల స్వగ్రామాల్లో కూడా వైఎస్సార్‌ సీపీ జెండా ఎగిరింది. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం చినమేరంగిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అల్లు రవణమ్మ 122 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

టీడీపీ సీనియర్లలో చాలా మందికి ఘోర‌మైన ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాస్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లకు స్థానిక ఎన్నికలు గట్టి షాకే ఇచ్చాయి. పరిటాల సొంత మండలం రామగిరిలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల పాగా వేయడంతో 26 ఏళ్ల పరిటాల ఆధిపత్యానికి చెక్‌ పడింది. మండలంలో 7 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. రామగిరి, పేరూరు, కుంటిమద్ది, పోలేపల్లి, కొండాపురం, గంతిమర్రి, చెర్లోపల్లి, ఎంసీ పల్లి పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. ధర్మవరం నియోజకవర్గంలోని 70 పంచాయతీల్లో 63 వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులు గెలుపొందారు.

రాయదుర్గం బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రి కాల్వకు ఘోర పరాభవం ఎదురయ్యింది. రాయదుర్గం నియోజకవర్గంలో 87 పంచాయతీ లకు గాను 70 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలో పయ్యావుల పట్టుకోల్పోయారు. బెలుగుప్పలోని 19 పంచాయతీల్లో 15 స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేశారు.

కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జ్‌ ఉమామహేశ్వర్‌నాయుడు సొంత పంచాయతీ అంకంపల్లిలో టీడీపీ ఓటమి పాలైంది. మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌ నియోజకవర్గం రాప్తాడు 58 పంచాయతీలుండగా.. వైఎస్సార్‌సీపీ అభిమానులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 130 పంచాయతీలకు గాను 117 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయదుందుభి మోగించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సొంత పంచాయతీ సంగాలలో వైఎస్సార్‌సీపీ అభిమాని విజయం సాధించారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు స్వగ్రామం అంకంపల్లిలో వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తుదారుడు రుద్ర విజయం సాధించారు. ఇలా ఏపీ మొత్తం పార్టీకి ఎదురుగాలి త‌గులుతోంది. త‌మ ప‌రువు కాపాడుకోవ‌డానికి సీనియ‌ర్ నేత‌లంద‌రూ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. కొన్ని చోట్ల ఫ‌లితం ఉండ‌డం లేదు.

Show comments