Idream media
Idream media
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ప్రభుత్వం కుండబద్దలుకొట్టినట్లు చెబుతోంది. ముఖ్యమంత్రే రంగంలోకి దిగి కార్మిక సంఘాల నేతలతో సమావేశమై వారిలో భరోసా నింపారు. కేంద్రం తమ వినతులకు స్పందించని పక్షంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామని స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రైవేటీకరణ ఉద్యమంలో ముందుంటున్నారు. ఇది లక్షల మంది కుటుంబాలపై ప్రభావం చూపే అంశం కావడంతో పార్టీ ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలే మిన్నగా కేంద్రంతో ఢీ కొట్టేందుకు సై అంటున్నారు.
ఇప్పటికే కేంద్ర పెద్దలతో పలుమార్లు భేటీ అయ్యారు. జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఇదే క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 20 నుంచి స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో పాదయాత్ర కు సిద్ధమయ్యారు. ప్లాంట్ పరిరక్షణకు పార్టీలకతీతంగా పోరాడతామని ప్రకటనలిస్తున్న తెలుగుదేశం నేతలు అందుకు విరుద్ధంగా విజయసాయి పాదయాత్రపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా మారింది.ప్రభుత్వమే ముందుండి పోరాడుతుండడంపై టీడీపీ అక్కసు వెళ్లగక్కడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశానికి పిలిచినా రాని టీడీపీ నేతలు పోరాడేవారికి మద్దతు ఇవ్వకపోగా రివర్స్ లో అడ్డంకులు సృష్టించడం సరికాదని అంటున్నారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కుదిపేస్తోంది. పలు పార్టీలు, కార్మిక సంఘాలు ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరోసారి గట్టిగా వినిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 20న స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్నామని, గాంధీ విగ్రహం నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు పాదయాత్ర జరుగుతుందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితమే వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారని, అందులో అనేక సూచనలు చేశారని చెప్పారు. గనులు కూడా కేటాయించాలని ప్రధానిని కోరారని తెలిపారు. సుమారు 25 కి.మీ. మేర పాదయాత్ర జరుగుతుందన్నారు. 13 పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేతలను పిలిచినా రాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
విజయసాయి పాదయాత్ర జనంలో, కార్మిక వర్గాల్లో ఆసక్తిగా మారింది. మరి దీని చూసి ఉలిక్కిపడ్డారా లేకా వణుకుతున్నారా ఏమో కానీ తెలుగుదేశం మాత్రం పాదయాత్ర వద్దంటోంది. పాదయాత్ర చేస్తాం, పార్లమెంట్ లోనూ పోరాడుతాం, కేంద్రం పైన అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తాం… అని చెప్పిన వైసీపీ నేతలు ఆ దిశగా కార్యాచరణలో కూడా చూపుతున్నారు. వైసీపీ నేతల భరోసాతో కార్మిక వర్గాలకు కాస్త ఊరట లభిస్తోంది. అధికారపక్షమే తమ ముందుండి పోరాడుతుండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం నాయకులు అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ క్రమంలోనే విజయసాయి పాదయాత్రకు రాజకీయాలను, ఎన్నికలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి వైసీపీ అభిమానులు కూడా దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. చేసే వారిపై ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా మంచిదికాదని టీడీపీ గుర్తిస్తే మేలని కొందరు సూచిస్తున్నారు.