ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. మొన్నటికి మొన్న ఏర్పాటు చేసిన జంబో ధర్మకర్తల మండలి వ్యవహారం సద్దుమణగక ముందే ఇప్పుడు టీటీడీ వెబ్ సైట్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటిదాకా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, సర్వదర్శనం టికెట్లు సాధారణ కౌంటర్లలో జారీ చేసే వాళ్ళు. కానీ భక్తులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అలాగే సర్వ దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిన్న ఉదయం అక్టోబర్ నెల కు సంబంధించిన టికెట్ల కోటా ను విడుదల చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ దర్శనం టికెట్లను బుక్ చేసుకునేందుకు గాను అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత జియో మార్ట్ సబ్ డొమైన్ లోకి రీ డైరెక్ట్ కావడంతో ఒక వర్గం మీడియా నిన్న ఉదయం నుంచి పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలు పెట్టింది.
Also Read : కియాలో ఏమి జరుగుతుంది? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ..
”దీంతో ‘టీటీడీ వెబ్‌సైట్‌ని కూడా అంబానీకి అమ్మేశారా?, టీటీడీకి, జియోమార్ట్‌కు సంబంధం ఏంటి? టీటీడీ వెబ్‌సైట్‌ను అంబానీకి కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం’ అంటూ ఏదేదో రాతలు రాసుకొచ్చారు. అసలు జరిగింది ఏంటంటే దర్శన టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో టిటిడి ఐటి విభాగం, టిసిఎస్ సంస్థల సహకారంతో పరిష్కరించారు. అయితే ఆ సాంకేతిక సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా అనేక మార్గాలను అన్వేషించగా క్లౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను వాడితే సెట్ అవుతుందని తేలింది. ఈ క్రమంలో అలాంటి సేవలు అందిస్తున్న అమెజాన్, జియో, బుక్ మై షో, అభిబస్ లాంటి సంస్థలను టీటీడీ సంప్రదించగా జియో సంస్థ దేవుడి కార్యక్రమం కాబట్టి 3 కోట్లు విలువైన క్లౌడ్ సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. అందుకే వెబ్ సైట్ కు జియో మార్ట్ సబ్ డొమైన్ వినియోగించారు.
Also Read : ఆంధ్రజ్యోతి రాతల్లో అసలు కోణమిదే, మీకు అర్థం కావాలంటే చదవండి
అయితే క్లౌడ్ సేవలు వాడినా కూడా నిన్న భక్తుల తాకిడి తట్టుకోలేక పోయింది. కొవిడ్ తీవ్రత తగ్గుతుండటం, టికెట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి డిమాండ్ పెరిగగడంతో భారీ ఎత్తున భక్తులు టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో రెచ్చిపోయిన ఒక వర్గం మీడియా ఇంకేముంది జియోకు అంతా అమ్మేశారు అన్నట్టు మాట్లాడటం గమనార్హం. గతంలో కూడా టీటీడీని టార్గెట్ చేయడానికి ప్రతిపక్ష టీడీపీ సహా ఆ పార్టీకి మద్దతుగా ఉన్న మీడియా సంస్థలు ఎన్నో ఎత్తులు వేశాయి. ఏకంగా చైర్మన్ సుబ్బారెడ్డి హిందూ కాదనే వాదన మొదలు అన్యమత ప్రచారం లాంటి అనేక విషయాలు తెర మీదకు తెచ్చి రచ్చ చేయాలని చూశారు.
ఈ విషయంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కొద్దీ నెలల క్రితం పరువు నష్టం దావా కూడా వేశారు. తిరుమలపై దుష్ప్రచారం సాగించిన మీడియా సంస్థలపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యవహారం కోర్టుల్లో ఉన్నా ఇంకా మీడియా సంస్థలు ఏమాత్రం తగ్గకుండా దుష్ప్రచారానికి పాల్పడడం చర్చకు దారి తీస్తోంది. ఈ అంశంలో టీటీడీ రంగంలోకి దిగకుంటే ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది.
Also Read : అగరబత్తీలపైనా కోర్టుకా..? పిటీషనర్‌కు హైకోర్టు మొట్టికాయలు